UNHRC : పాకిస్థాన్... నీతులు చెప్పడం ఆపేయ్ : భారత్

UNHRC : పాకిస్థాన్... నీతులు చెప్పడం ఆపేయ్ : భారత్

ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి పాకిస్థాన్... ప్రపంచానికి పాఠాలు చెప్పనవసరం లేదని భారత్ పేర్కొంది. United Nations Human Rights Council (UNHRC) సమావేశంలో భారత ప్రతినిధి పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని, హింసను ఎగుమతి చేసే పాకిస్థాన్ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. పాకిస్థాన్ తయారు చేసిన ఉగ్రవాదులు విచక్షణ లేకుండా వీధుల్లో తిరుగుతున్నారని చెప్పారు.

మానవ హక్కుల మండలి జనరల్ డిబేట్ యొక్క 52వ సెషన్‌లో భారత్.. తన ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుంది. అండర్ సెక్రటరీ డాక్టర్ పిఆర్ తులసీదాస్ మాట్లాడుతూ... పాకిస్థాన్ ప్రపంచానికి పాఠాలు చెప్పనవసరం లేదని అన్నారు. అనవసరపు మాటలకు బదులుగా సొంత దేశంలో మైనారిటీల భద్రత, శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని పాక్ కు హితవు తెలిపారు.

"ఉగ్రవాదులు విజృంభించి, పాక్ వీధుల్లో తిరుగుతున్నా, పట్టించుకోకుండా... ప్రపంచానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై పాకిస్థాన్ పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదం, హింసను ఎగుమతి చేసే దేశంగా పాకిస్తాన్ అందిస్తున్న సహకారం అసమానమైనది" అని తులసీదాస్ చురకలు అంటించారు.
పలు దేశాలచే గుర్తించబడిన 150 మంది అంతర్జాతీయ ఉగ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నిలయంగా ఉందని ఆయన అన్నారు. నిషేధించబడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ ఎన్నికలలో చురుకుగా ప్రచారం చేసి పోటీ చేశారని ఆయన నొక్కి చెప్పారు.

‘‘26/11 ముంబై ఉగ్రదాడుల నిందితులు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా సంచరిస్తూనే ఉన్నారు. ఈ వాస్తవాన్ని పాకిస్థాన్ కొట్టిపారేయగలదా?... ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ సజీవంగా పాకిస్థాన్ లోనే దొరికాడన్న వాస్తవాన్ని పాక్ కాదనగలదా? పాకిస్తాన్‌ మిలటరీ అకాడమీ సమీపంలో, తీవ్రవాదులు ఆశ్రయం పొంది, రక్షించబడ్డారన్న నిజాన్ని దాయగలరా?" అని తులసీదాస్ పాకిస్థాన్ ను ప్రశ్నించారు. జమ్మూ, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని మానవ హక్కుల మండలిలో నొక్కిచెప్పిన తులసీదాస్, భారత్ లోని అన్ని ప్రాంతాలు శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి వైపు ప్రయానిస్తున్నాయన్నారు.


"లౌకిక రాజ్యంగా ఉన్న భారత్... మైనారిటీల హక్కులను పరిరక్షించడంలో ముందుంది. పాకిస్తాన్‌ మాత్రం మైనారిటీలపై దైవదూషణ చట్టాలను ప్రయోగిస్తూ హింసిస్తున్నారు. మైనారిటీలపై భౌతిక హింస, వివక్ష, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ లేకపోవడం, కిడ్నాప్ లు, హత్యలు జరుగుతున్నాయి" అని ఆయన అన్నారు.

కేవలం దైవదూషణ చట్టాల ఆరోపణలతో పాకిస్థాన్ లో ఎక్కువమంది మైనారిటీలు ప్రాణాలను, స్వాతంత్య్రాన్ని, ఆస్తులను కోల్పోయారని అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ దైవదూషణ కేసులు ఉన్న దేశంగా పాకిస్తాన్ నిలుస్తుందని చెప్పారు.


Next Story