కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల ఆశలు

కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల ఆశలు
బడ్జెట్ పత్రాలు ముద్రించకుండా ఉండటం ఇదే మొదటిసారి.

దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశల పద్దు నేడు పార్లమెంటు ముందుకు రానుంది.. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.. బడ్జెట్‌కు ముందు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంటు భవనంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది.. అనంతరం బడ్జెట్‌ పార్లమెంటు ముందుకు వస్తుంది.. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్‌ ఇది.

సామన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరూ బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్‌ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు సామాన్యుడిలో ఆశలు మరింతగా పెంచుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఏడాది నుంచి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తర్వాత వస్తున్న బడ్జెట్‌ కావడంతో ఎంతో ప్రత్యేకత కనబడుతోంది. కరోనాతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. అలాగే వ్యవసాయానికి నిధుల కేటాయింపు పెంచాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పన్ను శ్లాబ్‌ ఉండాలని సూచిస్తున్నారు.

అటు ఈ బడ్జెట్‌పై సాధారణ, మధ్య తరగతి వర్గాలతోపాటు వేతన జీవులు, రైతులు, వ్యాపారులు, నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఉన్నారు. గడిచిన ఏడాది కరోనా కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నివర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు కుదేలయ్యారు. అనేక మందికి ఉపాధి దొర కక వలస బాటపట్టారు. ఆయా వర్గాల వారిని ఆదుకునేందుకు కేంద్రం ఇచ్చిన స్పెషల్‌ ప్యాకేజీలేమీ సామాన్యులకు అక్కరకు రాలేదు. ఇప్పటికీ అనేక రంగాలు కనీస స్థాయిలో కూడా కోలుకోలేదు. దీంతో ఈసారి బడ్జెట్‌పై సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఊతం ఇస్తే మళ్లీ ఉపాధి గాడిన పడే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

ఈసారి బడ్జెట్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈసారి బడ్జెట్ పూర్తిగా పేపర్‌లెస్‌గా ఉండనున్నది. బడ్జెట్ పత్రాలు ముద్రించకుండా ఉండటం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో బడ్జెట్‌ పత్రాలు అన్నీ డిజిటల్‌గా విడుదల కానున్నాయి. సభ్యులందరికీ డిజిటల్‌ కాపీలు అందించనున్నారు.. అలాగే దేశ ప్రజలంతా బడ్జెట్‌ను చూసేందుకు వీలుగా మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story