Modi Cabinet Expansion : కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..!
2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయ మంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రధాని మోదీ.. కొన్ని రోజులుగా కేంద్రమంత్రులు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో వరుస సమావేశాలు జరుపుతుండటంతో కేబినెట్ విస్తరణ వార్తలు జోరందుకున్నాయి. తుది జాబితాపై ఇప్పటికే మోదీ- అమిత్‌షా చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడుతుందని అందరు భావించారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం సాయంత్రం మంత్రులతో ప్రధాని కీలక విషయంపై భేటీకానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కారణాలేవీ చెప్పకుండానే ఈ సమావేశం రద్దు చేశారు.
కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఇప్పటివరకు కేంద్రమంత్రిగా విధులు నిర్వహించిన థావర్‌చంద్ గెహ్లోత్ కూడా ఉండటం గమనార్హం. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, జోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీకి మంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మిత్రపక్షాలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎల్జేపీ తిరుగుబాటు నేత పశుపతి పరాస్ కూడా కేబినెట్‌లో చేరతారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీకి మంత్రివర్గంలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. బంగాల్ నేతలకు సైతం ప్రాతినిధ్యం దక్కనుంది.
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇండోర్ నుంచి దిల్లీకి పయనమయ్యారు. బయల్దేరే ముందు ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అటు అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ కూడా గౌహటి నుంచి దిల్లీ వెళ్లారు. ఎంపీ నారాయణ్ రాణె మరో నేత సీపీ సింగ్ ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. కేబినెట్ రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అటు జేడీయూ సీనియర్ నేతలు లల్లన్ సింగ్, ఆర్సీపీ సిన్హా దిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. మిత్రపక్షమైన జేడీయూకు కూడా ఈ సారి కేబినెట్‌లో స్థానం కల్పించాలని మోదీ సర్కారు భావించింది. తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరింది. అయితే ఒకరికి కేబినెట్ పదవి ఇచ్చి.. మరొకరిని సహాయ మంత్రిని చేస్తామని బీజేపీ చెప్పినట్లు తెలుస్తోంది. 2019లో రెండో దఫా భాజపా ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే జేడీయూకు ఒక కేబినెట్ పదవి ఇస్తామని కాషాయ పార్టీ ఆఫర్ చేసింది. అయితే దాన్ని నితీశ్ కుమార్ తిరస్కరించారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com