దీపావళి వేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం గుడ్‌న్యూస్ ..!

Petrol and Diesel Rates : పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు ఊరటిస్తూ గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్ 5 రూపాయలు, డీజిల్‌పై ఏకంగా 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. సుంకం తగ్గింపు విషయమై బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తగ్గించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ విషయంలో రాష్ట్రాలను కూడా కదిలించింది కేంద్ర సర్కార్. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో... లాక్‌డౌన్ వేళ రైతులు తమ కష్టార్జితంతో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించారనీ... డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల.. వచ్చే రబీ సీజన్‌లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. అటు పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపుతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ...ఎదురుదెబ్బ తగలటంతో... బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే ప్రజలకు ఊరట కల్పించే యత్నం చేస్తూ కీలక ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాము కొంత తగ్గించి..రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించేలా ఇరకాటంలో పడేసే విధంగా ప్రకటన చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే సూచనలు లేవని స్వయంగా కేంద్ర ఇంధన శాఖ మంత్రే గతంలో ప్రకటించారు. ఆ తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా..పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు ప్రస్తుతానికి లేవని అన్నారు. ఇలాంటి తరుణంలో ఉపఎన్నికల ఫలితాల దెబ్బతో.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ ప్రకటన చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com