Uttar Pradesh : తొందరపడ్డ వరుడు... పెళ్లి పెటాకులు

Uttar Pradesh : తొందరపడ్డ వరుడు... పెళ్లి పెటాకులు
పదే పదే పెళ్లి కూతురి గదికి వెళుతున్న వరుడు; వద్దని వారించిన తండ్రి; పెళ్లి రద్దు....


అతితొందర మొదటికే మోసం తెచ్చింది. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ కు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి చేసుకోవడానికి వరుడి కుటుంబంతో పాటు బంధుమిత్రులు వధువు ఇంటికి వెళ్లారు. పెళ్లి మధ్యలో ఉంది. అప్పటికే వధూవరులు దండలు మార్చుకున్నా, పెళ్లి ముగియలేదు. దండలు మార్చుకున్న తర్వాత పెళ్లికూతురు కొన్ని కారణాలతో గదిలోకి వెళ్లింది. వధువుపై ఇష్టం పెంచుకున్న వరుడు తరచూ పెళ్లి కూతురి గదిలోకి వెళ్తూ వచ్చాడు. అతని అతి తొందర పెళ్లికూతురికి వెగటుపుట్టింది. అక్కడ ఉన్న బంధుమిత్రులు కూడా వరుడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయినా వరుడు పెళ్లికూతురి గదిలోకి వెళ్లిరావడం మానలేదు.


అంతలోనే వరుడి తండ్రి వారించాడు. పెళ్లి జరుగుతుండగా పెళ్లికూతురి గదిలోకి వెళ్లడం సంస్కారం కాదని నచ్చజెప్పబోయాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడి తండ్రి అతన్ని కొట్టాడు. కోపంతో ఊగిపోయిన వరుడు తిరిగి అతని తండ్రిని కొట్టాడు. ఊహించని ఘటనతో పెళ్లి వారు అవాక్కయ్యారు. అప్పటికే వరుడిపై చిరాకుతో ఉన్న పెళ్లికూతురు, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు కలిసి తీసుకున్నారు.

Tags

Next Story