Uttarakhand: కులవివక్ష: గుడిలోకి వెళ్లాడని...

ఓ దళిత యువకుడు దైవ దర్శనానికి గుడిలోకి వెళ్లాడని కాలిన కట్టెలతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సల్రాలో జరిగింది. జనవరి 9న ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయూష్ (22) అనే యువకుడు జనవరి 9న దైవదర్శనం చేసుకోడానికి గుడిలోకి వెళ్లాడు. దీంతో అగ్రవర్ణానికి చెందిన ముగ్గురు యువకులు సదరు దళిత యువకునికి ఆలయ ప్రవేశం నిషేధమని హెచ్చరించారు. అయినా ఆయూష్ గుడిలోపలికి వెళ్లడంతో అగ్రహానికి గురైన అశిషక్, ఈశ్వర్ సింగ్, భాగ్యన్ సింగ్, జైవీర్ సింగ్, చైన్ సింగ్ అతడిపై దాడి చేశారు. రాత్రంతా కాళ్లతో తన్నుతూ, కొడుతూ చిత్రవాథ చేశారు.
మరుసటి రోజు బట్టలు లేకుండా పడి ఉన్న ఆయూష్ గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అర్పణ్ యాదువంశీ తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం... దాడి జరిగిన తర్వాత ఆయూష్ కాలిన గాయాలతో స్పృహ తప్పి పడి ఉన్నాడని పోలీసులు చెప్పారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు.
ఆయూష్ కు మద్దతుగా పలువురు పోలీస్టేషన్ ముందు నినాదాలు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై షెడ్యూల్ కులాల కమిషన్ స్పందించింది. కమిషన్ సభ్యుడు అంజూబాలా జనవరి 16న ఉత్తరకాశీకి వెళ్లి అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com