ఉత్తరాఖండ్ దుర్ఘటనలో 53కి చేరిన మృతులు

ఉత్తరాఖండ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 53కు పెరిగింది. ఈ రోజు ఉదయం ఎన్టీపీసీ తపోవన్ ప్రాజెక్టు ప్రాంతంలోని అదిత్ సొరంగం వద్ద మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి దౌలిగంగా నదిలో పడటంతో ఈ నెల 7న తపోవన్ ప్రాంతంలో మెరుపు వరదలు చోటుచేసుకున్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. దీని ప్రభావంతో అక్కడ కొనసాగుతున్న హైడల్ ప్రాజెక్టు సొరంగాల్లో పలువురు చిక్కుకుపోయారు.
సొరంగాల్లో ఉన్న వారిని కనిపెట్టేందుకు కెమెరా లేదా... పైపును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు ప్రయత్నించాయి. అయితే.. నీరు, బురద అడ్డుపడటంతో ప్రస్తుతం ఎస్కవేటర్లతో మాత్రమే సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ దుర్ఘటనలో గల్లంతైన వారిలో ఇంకా 150 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. బయట పడ్డ మృతదేహాల డీఎన్‌ఏ నమూనాల సేకరణ తదితర కార్యక్రమాల అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
పాంగ్ గ్రామం మినహాయించి మిగిలిన గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు ఆహారం తదితర అత్యవసరాలతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ స్వాతి బదౌరియా తెలిపారు. దీంతోపాటు... మృతుల కుటుంబాలకు పరిహార చెక్కులను కూడా అందచేస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com