ఉత్తరాఖండ్ ఘటన: 134మంది మరణించి ఉంటారని ప్రభుత్వం వెల్లడి..!

కొద్దిరోజులక్రితం ఉత్తరాఖండ్ లో జరిగిన జలవిలయంలో ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన 134 మంది మరణించినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. గల్లంతైన, కనిపించకుండా పోయినవారు మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే చమోలీ హిమనీనద ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజాగా మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో అక్కడ చిక్కుకొని మరణించిన వారి సంఖ్య 70కి చేరింది. అయితే ఇప్పటివరకు 29 మానవ అవయవాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు లభించకుండా గల్లంతైన వారుకూడా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
బాధిత కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్ లు అందించనున్నట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి అమిత్ నేగి వెల్లడించారు. సాధారణ మరణ ధృవీకరణ పత్రాలకు, ఇవి భిన్నమైనవని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. బాధిత కుటుంబ సభ్యులు అవసరమైన అఫిడవిట్, ఇతర వివరాలు అధికారులు ఇస్తే.. విచారణ అనంతరం ధృవపత్రాలు అందిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com