Uttarakhand Floods: వర్షాల బీభత్సం.. ఉత్తరాఖండ్ ప్రజలు అప్రమత్తం..

Uttarakhand Floods (tv5news.in)
Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరుసగా రెండో రోజు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. పలు రహదారులు కొట్టకుపోయాయి.
పితోర్‌గఢ్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో గోరీగంగా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి మున్సియారి-జౌల్‌జిబి రహదారి కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శారదా బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. నందాకిని ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నైనిటాల్ కు రాకపోకలు నిలిచిపోయాయి.
చల్తీ నది భారీ ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. మరో ఘటనలో బద్రీనాథ్ నేషనల్ హైవేపై వెళ్తున్న ఓ కారు భారీ ప్రవాహం దెబ్బకు లోయలో పడిపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అతి కష్టం మీద బయటకు తీశాయి.
ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామితో ప్రధాని మోదీ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
మరోవైపు ఉత్తరాదిన సైతం భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. దేశరాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com