Valentines Day Tragedy: గోవాకు వెళ్లి... శవాలై తేలి.. జంట విషాదాంతం

ప్రేమికుల రోజును కలసి సెలబ్రేట్ చేసుకోవాలని తాపత్రయపడిన ఓ జంట అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. మృతులను సుప్రియా దుబే(26), విభు శర్మ(27)గా గుర్తించారు. పాలోలెమ్ బీచ్ వద్ద వీరి మృతదేహాలు కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు లైఫ్ గార్డుల సహాయంతో మృతదేహాలను ఒడ్డుకు చేర్చి కొంకణ్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ కు పంపారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుప్రియ, విభు బంధువులని పోలీసుల దర్యప్తులో వెల్లడైంది. ఇరువురు వేరువేరు నగరాల్లో పనిచేస్తున్నారు. సుప్రియ బెంగళూరులోనూ, విభు ఢిల్లీలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేలంటైన్స్ డేను కలసి జరుపుకోవాలని భావించిన ఇరువురూ తమ కుటుంబాలకు విషయం తెలియకుండా గోవాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా పాలోలెమ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో సుప్రియ, విభును చూసినట్లు స్థానికులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com