విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి : హైకోర్టు

విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి :  హైకోర్టు

జైలులో ఉన్న విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని వైద్యులను ఆదేశించింది బాంబే హైకోర్టు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని, నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య హేమలత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే మేనన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన తరఫు లాయర్‌ ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపించారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇందిరా జైసింగ్‌. అయితే .. ఈ వాదనలను అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ వ్యతిరేకించారు.

ఖైదీలు తమ వైద్యులను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తే ప్రతి ఒక్క ఖైదీ తమను నానావతికి తరలించాలని కోరుతారన్నారు. ఇది ప్రభుత్వ వైద్యులు, ఆసుపత్రుల విశ్వసనీయతను తక్కువ చేయడమే అవుతుందన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. నిందితుడి ఆరోగ్య పరిస్థితి తెలీకుండా ఆస్పత్రికి తరలించడం సబబు కాదంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని నానావతి ఆసుపత్రి వైద్యులను ఆదేశించింది. వీడియో మెడికల్‌ చెకప్‌ చేపట్టాలని, అది వీలు కాని పక్షంలో నేరుగా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను నవంబర్ ‌16లోగా సమర్పించాలని ఆదేశించాలంటూ విచారణను వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story