ఆరోగ్యానికి నల్ల బియ్యం.. కౌటిల్య చేస్తున్న 'వేద వ్యవసాయం'

ఆరోగ్యానికి నల్ల బియ్యం.. కౌటిల్య చేస్తున్న వేద వ్యవసాయం
ప్రజల జీవన విధానం మారుతోంది.. అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది.. తెల్ల బియ్యం తినేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

వేదాలు చదువుకున్నారు.. వాటి ద్వారానే వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆరోగ్యకరమైన భారతావనిని కలలుగన్న కౌటిల్య తాను చదువుకున్న వేదాల ఆధారంగా వ్యవసాయం చేస్తూ నల్లబంగారం పండిస్తున్నారు. ప్రజల జీవన విధానం మారుతోంది.. అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది.. తెల్ల బియ్యం తినేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కౌటిల్య కృష్ణబియ్యం సాగు చేస్తున్నారు. ఇందులో ప్రొటీన్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కౌటిల్య కృష్ణ బియ్యాన్ని (నల్ల బియ్యం) పండిస్తున్నారు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చ‌దువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తున్నారు.

కృష్ణ బియ్యం దేశవాళీకి చెందిన వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు కలిగిఉన్నట్లు వెల్లడైంది. యాంథోసయనిన్ అత్యధికంగాగల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి అని పరిశోధకులు తేల్చారు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్‌ ట్యాగ్ వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.

అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుతుంది. అదేవిధంగా మెదడు, కాలేయం పనితీరు మెరుగుపడేందుకు, బాడీ డీటాక్సిఫికేషన్ కు, కడుపులో మంటని తగ్గించేందుకు, బ్లడ్ లో సుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ లో ఉంచేందుకు, మలబద్ధకాన్నినివారించేందుకు, అతిసారను అరికట్టేందుకు కృష్ణబియ్యం ప్రముఖ పాత్ర పోషిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి.

అసలీ కృష్ణబియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి..

అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి ధార్మిక‌ ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞ యాగాదుల్లో, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం గురించి అవగాహన ఉంది. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి పేర్కొనడమే అందుకు నిదర్శనం.

'ఆయుర్వేద మమోదధి'అనే ప్రాచీన గ్రంథంలో అనేక వరి వంగడాలను గురించి వివరించారు. రక్తో భీరుక, పుండరీక (తెల్లని వరి రకం), కలమ (దళసరి బియ్యం - మే, జూన్‌లలో నాటతారు. డిసెంబరు లేదా జనవరిలో పంట చేతికి వస్తుంది). మహాపుష్పకో (పెద్ద పువ్వులతో), డిర్ఘాహ్ (పొడవైన కంకులు), కంకణ (స్వర్ణ పొట్టు) మొదలైన వరి రకాల గురించి వివరించారు. 'చరక సంహిత'లో కూడా ఈ పంట రకాల గురించి వర్గీకరించి వివరించారు. కృష్ణ బియ్యానికున్న‌ ఔషధ లక్షణాలను కూడా వివరించారు. ఈ బియ్యం చర్మ రుగ్మతలను నయం చేయడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి ఉపయోగించేవారని గ్రంధాల్లో పేర్కొన్నారు.

కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

అమెరికా వ్య‌వ‌సాయ విభాగం(యూఎస్‌డీఏ) ప్రకటించిన వివరాల ప్రకారం 100 గ్రాముల కృష్ణ బియ్యంలో క్రింది పోషకాలు ఉంటాయి :

ప్రొటీన్లు - 8.8 నుంచి 12.5 గ్రాములు

లిపిడ్స్ - 3.33 గ్రాములు

ఐరన్ - 2.4 మిల్లీ గ్రాములు

అమిలోజ్ - 8.27 శాతం

కాల్షియం - 24.06 మిల్లీ గ్రాములు

మెగ్నీసియం - 58.46 మిల్లీ గ్రాములు

యాంథోసయనిన్స్ - 69 నుంచి 74 మిల్లీ గ్రాములు

కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృ‌ష్ణ‌న్ కోరుతున్నారు. ఫంక్షనల్ ఫుడ్ మార్కెట్ల విస్తరణలో పోటీ పడే కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఈ ధాన్యాలను ఫుడ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చ‌ని ఆయన అంటున్నారు. కృ‌షి భార‌తం సంస్థ‌ను నెల‌కొల్పి వ్య‌వ‌సాయరంగంలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ కౌటిల్య క్ర‌మం త‌ప్ప‌కుండా వృ‌ష‌భోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తున్నారు.

Tags

Next Story