సుశాంత్ కేసు.. విజయశాంతి ఫైర్

సినీ నటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంపై స్పందించారు. గత కొద్ది రోజులుగా పలు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడం, మీడియాలో దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.
సుశాంత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన సంఘటనలే జరిగాయి. ఎందరో నటీమణులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి జరిగేలా దర్యాప్తులు జరిగాయా.. నామ మాత్రంగా కేసులు నమోదు చేసుకోవడం.. తూతూ మంత్రంగా విచారణ చేపట్టడం.. కొన్ని రోజులకి మర్చిపోవడం చూస్తూనే ఉన్నాం.
కానీ సుశాంత్ కేసులో బయటకు వస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై తమ టాలెంట్ నిరూపించుకోవాలని వచ్చే కళాకారులకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులనేవి వివక్ష లేకుండా జరగాలి. ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు కూడా చివరి నిమిషంలో నీరుగారుతున్నాయి.. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి అని విజయశాంతి పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com