అవ్వా.. నువ్వు సూపర్.. 70 ఏళ్ల వయసులో యూట్యూబ్ స్టార్‌

అవ్వా.. నువ్వు సూపర్.. 70 ఏళ్ల వయసులో యూట్యూబ్ స్టార్‌
70 ఏళ్ల వయసులో నేనేం చేయగలను అనే వాళ్లని గరిటె తీసుకుని నెత్తి మీద ఒక్కటిచ్చుకుంటుంది..

మాటలో అమాయకత్వం.. మనసులో మంచితనం.. మన గంగవ్వ తెలుగువారందరికీ సుపరిచితం.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎక్కడెక్కడి వారందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆమె తన మాట ద్వారా మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తే మహారాష్ట్ర గంగవ్వ మాంఛీ రుచికరమైన వంటలు వండేస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టేసింది.. 70 ఏళ్ల వయసులో నేనేం చేయగలను అనే వాళ్లని గరిటె తీసుకుని నెత్తి మీద ఒక్కటిచ్చుకుంటుంది.. ఈ కాలం కుర్ర వెధవలకి మనం ఏ మాత్రం తీసిపోని విధంగా మనకి వచ్చింది చేద్దాం.. ఎందుకు ఆ నిరుత్సాహం అంటూ తన తోటి వారిని ఉత్సాహ పరుస్తోంది.. నా చేతి వంట ఎంత బావుంటుందో ఓ సారి తిని చూడకూడదు అంటూ ఊరిస్తోంది..

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే 'సరోలా కసర్' అనే ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది 70 ఏళ్ల సుమన్ ధమానే. ఆమె దగ్గరే ఉంటూ మనవడు ఇంటర్ చదువుకుంటున్నాడు.. అమ్మమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుందని లొట్టలేసుకుంటూ తినేవాడు ఆమె ఏ కూర చేసినా.. ఓ రోజు ఆమెతో.. ఎప్పుడూ నీ కొచ్చిన వంటలే చేస్తావు.. ఈ రోజు నా కోసం పావ్ భాజీ చేసి పెట్టవా అని అమ్మమ్మ దగ్గర గారాలు పోయాడు.. ఎలా చేయాలో చూపిస్తాను చూడు అంటూ యూట్యూబ్‌లో పావ్ భాజీ తయారు చేసే విధానాన్ని చూపించాడు..

ఏవుందిరా అందులో.. అంతకంటే నేను కూడా బాగా చేయగలను చూడు అంటూ.. అందులోకి కావలసిన దినుసుల్ని చక్కగా రోట్లో దంచి ఘుమ ఘుమ లాడే పావ్ బాజీని గంటలో తయారు చేసి మనవడికి అందించింది. ఆహా!! అమ్మమ్మా ఏం చేశావే.. ఎంత బావుందో అంటూ.. అవునే అమ్మమ్మా ఇంత బాగా చేశావు కదా.. మళ్లీ చేయి నేను వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతాను అన్నాడు.. దాంతో అమ్మమ్మ వంటలు చేయడం.. మనవడు వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం జరుగుతోంది. ఈ లోపు లాక్‌డౌన్ వచ్చింది. రెండు నెలలు పని మూల పడింది..

అయినా మూడో నెలలో మళ్లీ ముచ్చటగా ప్రారంభించారు. ఈ సారి వాళ్ల పెరట్లో కాసిన కాకరకాయలతో మొదలు పెట్టారు. చేదున్న కాకర కాయ ఆమె చేతిలో పడగానే చేదుని మర్చిపోయింది అంత బాగా వండింది.. నవ్వుతూ, నవ్విస్తూ వచ్చినట్లు చేసిన వంకాయ కూరకీ వేలల్లో వ్యూస్ వచ్చాయి. రోట్లో వేసి పల్లీల చట్నీ చేస్తే ఇంత బావుంటుందా అవ్వా.. నువ్వు చేస్తుంటే మాకు నోరూరిపోతోంది అంటూ కామెంట్లు.. చదవడం రాకపోయినా మనవడు చదివి వినిపిస్తుంటే ఆ ఆనందం పట్టలేకపోయింది. ఇక అక్కడి నుంచి ఆమె గరిట తిప్పడం ఆపలేదు..

మహారాష్ట్ర వాసులు మర్చిపోయిన పాత వంటలను మళ్లీ వారికి రుచి చూపించింది. ధమానే వీడియోలు చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. నాలుగు నెలల్లోనే 6 లక్షల మంది సబ్‌స్కైబర్స్ అయ్యారు. సాబూదానా కిచిడి, మసాలే బాత్, బటాడా వడ, పానిపూరి, రగ్డా.. ఇలా దాదాపు 140 వంటల వీడియోలు పోస్ట్ చేసింది. వీటన్నింటికీ కలిపి దాదాపు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ముఖంలో ఆనందం, వేలల్లో ఆదాయం.. నేటి తరానికి స్ఫూర్తి దాయకం సుమన్ ధమానే. ఆమే స్వయంగా నూరి చేసే మసాలాలకూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 'ఆప్లీ ఆజీ' పేరుతో ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానెల్‌తో మహారాష్ట్ర ప్రజల వంటగదిలో ప్రవేశించిన సుమన్.. తాను చేసిన మసాలాలకు తానే బ్రాండ్ అంబాసిడర్.

Tags

Next Story