మరోసారి కరోనా కేర్ సెంటర్లుగా రైల్వే కోచ్‌లు

మళ్లీ రైల్వే కోచ్‌లలో కరోనా ట్రీట్‌మెంట్ చేసే రోజులు వచ్చేశాయి. ఆస్పత్రులలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో రైలు బోగీలనే కరోనా కేర్ సెంటర్లుగా మార్చబోతున్నారు. ముంబైలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. అటు రైల్వే అధికారులు కూడా అడిగితే కాదనకుండా రైల్వే కోచ్‌లు అప్పగిస్తామని చెబుతున్నారు.
ముంబైలోని MMR ప్రాంతంలో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే కేర్ కోచ్‌ల అవసరం పడొచ్చని భావిస్తున్నారు. రైల్వే బోగీలోని జనరల్, స్లీపర్ క్లాస్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే అవకాశం ఉంది. ఒక కోచ్‌లో 16 పడకల్ని ఏర్పాటు చేయవచ్చని అధికారులు తెలిపారు.
గతేడాది కరోనా సమయంలో రైలు బోగీలనే కరోనా కేర్ కోచ్‌లుగా మార్చారు. దాదాపు 5వేల బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ఇప్పుడు కూడా ఆ కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ముంబై సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే... రైలు బోగీలనే పెద్ద సంఖ్యలో ఐసోలేషన్ వార్డులుగా మార్చాయి. మధ్య రైల్వే దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 482 బోగీలను కరోనా కేర్ కోచ్‌లుగా మార్పు చేశాయి. పశ్చిమ రైల్వే కూడా సుమారు 2 కోట్లు వ్యయం చేసి 410 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాయి.
వీటిలో ఇప్పటికీ కొన్ని కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ముంబై డివిజన్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి ఇప్పటికీ 128 కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వీటిని ఐసోలేషన్ వార్డులుగా వాడుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com