Who Is Bhupendra Patel : ఒక్కసారి ఎమ్మెల్యే.. కట్ చేస్తే సీఎం.. ఎవరీ భూపేంద్ర పటేల్..!

Who Is Bhupendra Patel : గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. కేంద్ర పరిశీలకులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో జరిగిన జరిగిన బీజేపీఎల్‌పీ సమావేశంలో భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా సీఎంగా నిర్ణయించారు. రేపు భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైన చాలానే కసరత్తు జరిగింది. చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. ఇందులో కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఫైనల్‌గా ఎవరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అతనే భూపేంద్ర పటేల్.
59 ఏళ్ల భూపేంద్ర పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో(2017) మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయనని సీఎంగా ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఎవరీ భూపేంద్ర పటేల్ అనే ఆలోచనలో అందరిలో మొదలైంది. భూపేంద్ర పటేల్ అసలు పేరు భూపేంద్రభాయ్ పటేల్.. ఈయన పటీదార్ కమ్యూనిటీకి చెందినవారు. భూపేంద్ర పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌లో చాలాకాలం కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఆయన స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్ధి కాంగ్రెస్ నేత శశికాంత్ పటేల్‌పై లక్ష డెబ్బై వేల ఓట్లకి పైగా తేడాతో విజయం సాధించారు.
2017 ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపుపొందిన నాయకుడు భూపేంద్ర పటేల్ కావడం విశేషం. కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ లోక్‌సభ సీటులో బాగమే ఈ ఘాట్‌లోడియా అసెంబ్లీ నియోజకవర్గం . కాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కి ఈయన చాలా సన్నిహితుడు.. ఆనందిబెన్ పటేల్ గవర్నర్ కావడానికి ముందు 2012లో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన భూపేంద్ర పటేల్.. గతంలో అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com