who is Charanjit Singh Channi : ఎవరీ చరణ్ జిత్ సింగ్ చన్నీ.. ?

పంజాబ్ కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదించింది. పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరును అధికారికంగా ప్రకటించింది. ఎస్సీ నేతకు ఈసారి ఎఐసీసీ అవకాశం కల్పించింది. మొదటగా చరణ్ జిత్ చన్నీ పేరును ట్విట్వర్ ద్వారా ఏఐసీసీ పరిశీలకులు హరీష్ రావత్ వెల్లడించారు. సుఖ్ జిందర్ సింగ్ రంధావా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం బలంగా హోరెత్తినా, అనూహ్యంగా చరణ్ జిత్ సింగ్ తెరపైకి వచ్చారు. గవర్నర్ నివాసానికి వెళ్లిన చరణ్ జిత్... సీఎల్పీ నిర్ణయాన్ని భన్వర్‌లాల్ కు తెలియజేశారు.
నిన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన పంజాబ్ సీఎం కుర్చీని భర్తీ చేయడానికి ఎఐసీసీ భారీ కసరత్తే చేసింది.పంజాబ్ కొత్త సీఎం పీఠం కోసం తొలుత మాజీ పిసీసీ అధ్యక్షులు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్, సుఖ్‌జిందర్ సింగ్ రంధావా పేర్లు వినిపించినప్పటికీ.. అదృష్టం చరణ్ జిత్ సింగ్ చన్నీనే వరించింది.
దళితవర్గానికి చెందిన చన్నీ... రంధాసియా సిక్ కమ్యూనిటీకి చెందినవారు. 1973ఏప్రిల్ రెండున బజౌలీలో జన్మించిన చన్నీ.... మూడుసార్లు పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు 2015 నుంచి రెండేళ్లపాటు పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com