కారు బాంబు కేసు.. క్రైమ్ ఇంటెలిజెన్స్ అధికారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకోవడంతో.. అతడి నుంచి కీలక ఆధారాలు రాబట్టే అవకాశాలున్నాయి. ఘటన జరిగిన సమయంలో వాజే అక్కడే ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కారు బాంబు కేసు మరో మలుపు తిరిగింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజేను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. వాట్సాప్ మెసెజ్ ఆధారంగా అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరుపరచగా.. ఈనెల 25 వరకు కస్టడీ విధించింది. అటు ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను ఉంచడానికి కారణమైన ఫోన్‌ను తిహార్ జైలు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌ను తీహార్ జైలులోని బ్యారక్ నంబర్ 8లో ఉంచిన భారతీయ ముజాహిదీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దానిని తీసుకుంది. ఈ ఫోన్ నుండే టెలిగ్రామ్ ఛానల్ పనిచేస్తుందని, దీని నుండి అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలను ఉంచే పని చేపట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు.
వాస్తవానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సచిన్ వాజేకు పేరుంది. దాదాపు 63 మందిని కాల్చి చంపి కిల్లింగ్ మెషిన్‌గా ఆయన పేరు తెచ్చుకొన్నారు. 1990లో మహారాష్ట్ర పోలీసు విభాగంలో చేరిన సచిన్.. తొలుత నక్సల్ ప్రభావిత గడ్చిరౌలిలో పనిచేశారు. ఆ తర్వాత థానే పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి పెద్దకేసులు దర్యాప్తు చేస్తూ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. 2003లో ఘుట్‌కోపర్ బాంబు పేలుడు కేసులో క్వాజా యూనిస్ అనే ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. అతడు కస్టోడియల్ డెత్‌కు గురయ్యారు. ఈ కేసులో 2004లో సచిన్ వాజే సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో 2008లో పోలీస్‌శాఖకు రాజీనామా చేసి శివసేనలో చేరారు.
మరోవైపు కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్పట్లో పోలీసు అధికారులు సరిపోవడంలేదంటూ సచిన్‌వాజేకు అత్యంత కీలకమైన క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో గత నెల 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో వాహనంలో పేలుడు పదార్థాల కేసు దర్యాప్తునకు తొలుత అక్కడకు వచ్చిన వారిలో సచిన్ వాజే కూడా ఉన్నారు. ఆ వాహనం.. థానేలోని కార్ల ఇంటీరియర్ వ్యాపారి మన్‌సుఖ్ హిరెన్‌గా గుర్తించారు. అప్పటికి వారం ముందే మన్‌సుఖ్.. తన వాహనం అపహరణకు గురైందని కేసు పెట్టారు.
పేలుడు పదార్థాలు ఉంచిన కారును గతంలో నాలుగు నెలలు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాడినట్లు మన్‌సుఖ్ కుటుంబీకులు ఆరోపించారు. ఇటీవలే అది తమ చేతికి వచ్చిందని వెల్లడించారు. మన్‌సుఖ్ కుటుంబం చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనికితోడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సైతం ఆరోపణలు చేశారు. దీంతో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కేసులో సచిన్ వాజేపై తీవ్ర ఆరోపణలు రావడంతో.. ఎన్‌ఐఏ అతడ్నిఅరెస్ట్ చేసింది. త్వరలో స్కార్పియో యజమాని శామ్ న్యూటన్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సీఐయూలోని మరికొందరు అధికారులను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com