Who is Shabnam Ali : ఎవరీ షబ్నమ్ అలీ.. ఏం చదువుకుంది.. ఎందుకు హత్యలు చేయాల్సి వచ్చింది?
Who is Shabnam Ali : ప్రేమకు సంతోషం, త్యాగం తెలుసు. చరిత్రలో ఎన్నో ప్రేమకథలు అదే చెప్పాయి. కానీ మూర్ఖత్వం, కర్కశత్వం, నేరం, ఘోరం కూడా తెలుసని ఈ ప్రేమకథ వింటే మనకు అర్థమవుతుంది. షబ్నమ్.. ఉత్తరప్రదేశ్ లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన ముస్లిం మహిళ. అందరి యువతుల్లాగానే ఓ అబ్బాయిని ప్రేమించింది. కానీ అది పెద్దలకు ఇష్టం లేదు. ఇలాంటి ప్రేమకథల్లో చోటుచేసుకునేవి రెండే మలుపులు.. అయితే పెద్దలకు వ్యతిరేకంగా వేరే పద్దతుల్లో పెళ్లి చేసుకోవడం, లేదంటే ఆ ప్రేమను త్యాగం చేయడం. ఇక్కడ విషాదాంతం గురించి చెప్పడం లేదు. ఎందుకంటే ఎక్కువ ప్రేమకథలకు అలాంటి ముగింపు ఉండదు. కానీ షబ్నమ్ ప్రేమకథను వింటే షాకవ్వాల్సిందే. ఎందుకంటే తన ప్రేమను గెలిపించుకోవడానికి తన కుటుంబంలోని ఏడుగురుని పొట్టనబెట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే..
2008, ఏప్రిల్ 15. ఆ రోజు దేశమంతా ప్రశాంతంగానే ఉండి ఉండొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ లోని బావాంఖేరి గ్రామం మాత్రం భయంతో వణికిపోయింది. అది కూడా ఓ ప్రేమ కథలో చోటుచేసుకున్న ఘటనను చూసి. ఇంతకుముందు మనం చెప్పుకున్న షబ్నమ్ కు సంబంధించిన ప్రేమకథ అది. తన ప్రేమని కాదన్నారని, కన్నతల్లిదండ్రులతో సహా కావలసినవారందరినీ పొట్టనబెట్టుకుంది. ఫలితంగా షబ్నమ్ అలీ ఉరికంబం ఎక్కబోతోంది. స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్ష పడిన మొట్టమొదటి మహిళగా షబ్నమ్ అలీ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. అయితే ఆమెను ఉరి తీయడానికి ఇంకా తేదీ, సమయం ఖరారు కాకపోయినా.. మధురైలోని జైల్లో మాత్రం ఆమె ఉరిశిక్షకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంతకీ షబ్నమ్ అలీ ఎవరు? రెండు పీజీలు చేసిన చదువుల తల్లి.. ఎందుకు ఈ హత్యలు చేయాల్సి వచ్చింది.. స్టోరీలోకి వెళితే.. సీన్ సీన్ కి మలుపులు కనిపిస్తాయి.
* షబ్నమ్ అలీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావాంఖేరి గ్రామం ఆమెది. సైఫీ ముస్లిం వర్గానికి చెందిన ఆమె తండ్రి టీచరుగా పనిచేశారు. షబ్నమ్.. ఇంగ్లీష్, భౌగోళిక శాస్త్రంలో ఎంఏ చేసింది. అంటే రెండు సబ్జెక్టుల్లో పీజీలు చేసింది. సో.. ఉన్నత విద్యావంతురాలే. అంత చదువుకున్న ఆమెకు చాలా తెలివితేటలు ఉండి ఉంటాయని, ఏ పని చేసినా ఆలోచించి చేస్తుందని అనుకుంటే పొరపాటే.. క్షణికావేశంలో ఎవరూ క్షమించని నేరం చేసింది.
* షబ్నమ్ కొద్ది రోజులు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. పాఠశాలలో ఆమె అంటే గౌరవం.. విద్యార్థులకు షబ్నమ్ ఎంతో ఇష్టమైన టీచర్ కూడా.
* మంచి లక్షణాలున్న అమ్మాయిగా పేరున్న షబ్నమ్.. ఆరో తరగతి మధ్యలోనే ఆపేసిన సలీంని ప్రేమించింది. సలీం చదువుకోకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ రంపపు కోత మిషన్ లో దినసరి కూలీగా పనిచేసేవాడు.
* సలీంతో ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. షబ్నమ్ కుటుంబంలో చదువుకున్న వ్యక్తులు అధికం. దానికి తోడు సలీం కంటే సంపన్నులు. అన్ని విధాలుగా అతడి కంటే ఎన్నో రెట్లు పై మెట్టు మీద ఉంది షబ్నమ్ కుటుంబం. సలీమ్ కుటుంబం ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కుటుంబం. దీనికితోడు అతడి సామాజిక నేపథ్యం షబ్నం తల్లిదండ్రులకు రుచించలేదు. దాంతో ఆమె ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. షబ్నమ్ తాత అయితే మనవరాలు చేసిన పనికి తలెత్తుకోలేక, బయటకు వెళ్లలేక పోయేవాడు. సరిగా ఆహారం కూడా తీసుకునేవాడు కాదని గ్రామస్తులు చెప్పారు. దానికి కారణం వారికి షబ్నం అంటే చెప్పలేనంత ఇష్టం. బాగా చదువుకుంది మంచి ఉద్యోగం చేసి కుటుంబం పేరు నిలబెడుతుందని ఆశించేవారు.
* సలీంతో షబ్నమ్ సంబంధం గురించి ఆమె తమ్ముడు రషీద్‌కు కూడా తెలుసు. ఈ విషయంలో రషీద్.. షబ్నమ్‌ను ఒకసారి చెంపదెబ్బ కొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు.
* ఇంట్లో తన ప్రేమను వ్యతిరేకించిన ఏడుగురినీ అసహ్యించుకున్నారు షబ్నమ్. వారే అడ్డు లేకపోతే సలీమ్ తో తన జీవితం సంతోషంగా ఉంటుందని భావించింది. ఆ ఆలోచనే ఆమెతో హత్యలు చేయించ డానికి వెనుకాడనివ్వలేదు. కుటుంబాన్ని అంతమొందించాలని అనుకుంది. అందులో భాగంగానే ఎప్పుడు ఇంట్లోకి లీటర్ పాలు తీసుకొచ్చే షబ్నం.. ఏప్రిల్ 15, 2008 న రెండు లీటర్ల పాలు కొనుక్కొ చ్చింది.
* పాలలో మత్తు మందు కలిపి కుటుంబంలోని ఏడుగురికీ ఇచ్చింది. వారు మత్తులోకి జారుకున్నాక ఆ ఏడుగురినీ షబ్నమ్ గొడ్డలితో నరికి చంపేసింది. అయితే హత్యలు జరుగుతున్నప్పుడు సలీం అక్కడే ఉండడంతో.. కుట్రలో పాలు పంచుకున్నందుకు గాను కోర్టు సలీంకు కూడా మరణశిక్ష విధించింది.
* ఈ హత్యల నుంచి తప్పించుకునేందుకు షబ్నమ్ తనకు వరసకు సోదరుడయ్యే వ్యక్తిని ఇందులో ఇరికించాలని చూసింది.. ఆ తరవాత తన తండ్రి ఆస్తిని సొంతం చేసుకుని, సలీంతో జీవించాలని భావించింది. కానీ కథ అడ్డం తిరిగింది.
* ఈ హత్యలు చేసినప్పుడు షబ్నమ్ వయసు 27 ఏళ్లు.. సలీం వయసు 25 ఏళ్లు. షబ్నం కంటే ఆమె ప్రియుడు సలీం రెండేళ్ల చిన్నవాడు. ఇప్పుడు షబ్నమ్ కి 39 ఏళ్లు.
* ప్రేమించిన వాడి కోసం కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులను పొట్టన బెట్టుకున్న సంఘటనలు ఇప్పటి వరకు విని వుండం. షబ్నమ్ ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని ఆమె మేనమామ సత్తార్ అలీ చెప్పారు.
* ఈ కేసులో షబ్నమ్, సలీమ్ లను దోషులుగా తేల్చిన సెషన్స్ కోర్టు 2010 లోనే వారికి మరణశిక్షను విధించింది. ఈ 11 సంవత్సరాల్లో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు వీరిరువురు.
* చివరికి రాష్ట్రపతి ముందుకు కూడా వెళ్లింది షబ్నమ్ క్షమాభిక్ష పెట్టమని. కానీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్షను తిరస్కరించారు. యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కూడా క్షమాభిక్షను తిరస్కరించారు.
*కేసు విచారణ సమయంలో ఈ జంట ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఎవరో తెలియని దుండగులు షబ్నమ్ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కుటుంబాన్ని చంపారని సలీం చెప్పగా, సలీమే తన కుటుంబాన్ని కత్తితో చంపాడని షబ్నమ్ చెప్పుకొచ్చింది. చివరగా సలీం వచ్చేసరికి తానే తన కుటుంబాన్ని చంపినట్టుగా షబ్నమ్ ఒప్పుకొంది. అంటే ప్రేమకోసం కుటుంబాన్నే హతమార్చిన షబ్నమ్.. చివరకు ప్రేమించిన సలీమ్ పైన కూడా కేసును నెట్టేయడానికి వెనుకాడలేదు.
* ఈ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు షబ్నమ్ అలీ ఏడూ నెలల గర్భవతి.. ఆ తర్వాత జైల్లోనే మహ్మద్ తాజ్ కి డిసెంబర్ 2008లో జన్మనిచ్చింది. అయితే జైలు నిబంధనల ప్రకారం పిల్లవాడికి ఆరేళ్ల వయసు వచ్చిన తరువాత కారాగారం పరిసరాల్లో ఉంచకూడదు. అందుకే తన మిత్రుడైన జర్నలిస్ట్ ఉస్మాన్ సైఫీని తాజ్‌కు సంరక్షకునిగా నియమించింది షబ్నమ్. ఇది 2015లో జరిగింది. అప్పటినుంచి ఉస్మాన్ సైఫీ అతని భార్య సుహినా ఆ పిల్లాడిని పెంచుకుంటున్నారు.
* ఇప్పుడు 12ఏళ్లు వచ్చిన మహ్మద్ తాజ్.. తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.
* ఆమె ఉరిశిక్షకి ఇంకా తేది, సమయం ఖరారు కానప్పటికీ మదురై జైల్లో మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు ఉరితాళ్లకు ఆర్డర్ ఇచ్చారు.
* నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి వేసిన తలారి పవన్ జల్లాద్ .. షబ్నమ్‌నూ, సలీంను ఉరి తీసే అవకాశం ఉంది.
* కాగా గతంలో రామశ్రీ అనే మహిళకి 1998 లో మరణశిక్షను విధించారు. కాని ఆమె జైలులో ఉన్నప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.. దీంతో ఆమె మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com