Who is Sumnima Udas : ఎవరీ సుమ్నిమా ఉదాస్.. ఈమె పెళ్లి కోసమే నేపాల్‌కు రాహుల్..!

Who is Sumnima Udas : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పబ్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి అని చెప్పుకునే రాహుల్.. ఇలా పబ్‌లో తిరగడం ఏంటని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.. అయితే వ్యక్తిగత పర్యటనలపై విమర్శించడం సరికాదని అదే స్థాయిలో కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఐదు రోజుల పర్యటనకు సోమవారం ఖాట్మండ్‌కు వెళ్లారు.. అక్కడ తన స్నేహితురాలు అయిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి రాహుల్ హాజరైనట్టుగా అక్కడి మీడియా తెలిపింది. ఇంతకీ ఈ సుమ్నిమా ఉదాస్ ఎవరు.. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సుమ్నిమా ఉదాస్ ఓ పాత్రికేయురాలు.. అమెరికాలోని వాషింగ్టన్ అండ్ లీ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీని మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ తో పాటుగా అనేక అంశాల పైన ఆమె కథనాలు రాశారు. 2001 నుంచి 2017వరకు సీఎన్‌ఎన్‌లో పనిచేసిన సుమ్నిమా.. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు. సుమ్నిమా ఉదాస్ తన జర్నలిజం వృత్తిలో అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. 2014లో అమెరికన్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటుగా సినీ గోల్డెన్ ఈగిల్ అవార్డు కూడా అందుకున్నారు.
సుమ్నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. . సుమ్నిమా ఉదాస్ పెళ్లికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టుగా భీమ్ ఉదాస్ వెల్లడించారు. మే 2న సుమ్నిమా ఉదాస్ పెళ్లి జరగగా, మే 5న హయత్ రీజెన్సీ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com