రాష్ట్ర ఉపాధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి వరకు... ఎవరీ తీరత్ సింగ్ రావత్ ?

Who is Tirath Singh Rawat : ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో ఏడాది ఉండగా కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్ ను అధిష్టానం నియమించింది. ఈ రోజు(బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఎవరీ తీరత్ సింగ్ రావత్ అనే ప్రశ్న అందరిలో మొదలైంది.
తీరత్ సింగ్ రావత్ పౌరి గర్హ్వాల్ జిల్లాలోని సిన్రో గ్రామంలో జన్మించారు.. ఆయన తండ్రి కలాం సింగ్ రావత్, తల్లి గౌర దేవి. ఆయన రాజ్‌పుత్ కుటుంబానికి చెందినవారు.
తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
1997 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్.. భారతదేశంలో 27వ రాష్ట్రంగా 2000 సంవత్సరములో ఏర్పడింది. అలా ఏర్పడిన కొత్త రాష్ట్రానికి మొదటి విద్యాశాఖమంత్రిగా తీరత్ సింగ్ పనిచేశారు.
2012 లో చౌబాతఖల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, 2013లో ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇక 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మనీష్ ఖండూరిని 3.50 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
56 ఏళ్ళ తీరత్ సింగ్ రావత్ కి నెమ్మదస్తుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com