కొత్త వైరస్ ప్రమాదమా.. : డబ్ల్యుహెచ్ఓ

ఏంటో కరోనాతోనే జనాలు ఛస్తుంటే మరో కొత్త వైరస్ అంట. ప్రకృతి ఏమైనా పగబట్టిందా లేక చైనీయులే ప్రంపంచ ప్రజల మీదకు ఈ కొత్త వైరస్‌ని వదిలారా అనే అనుమానాలు అత్యధికులు వెలిబుచ్చుతున్నారు.. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందన్న వార్తలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వైరస్‌ని గురించిన సమగ్ర సమాచారం తెలిసేంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. నిర్లక్ష్యం వలదంటోంది. యూకేలో బయటపడ్డ ఈ కొత్త రకం కరోనా వైరస్ గురించి అనుక్షణం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఇతర దేశాలన్నీ యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే ఐరోపాలోని పలు దేశాలు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమానాలను రద్దు చేయగా, తాజాగా కెనడా కూడా యూకేకు నడిచే విమాన సర్వీసులను నిలిపి వేసింది. ప్రస్తుతం 72 గంటల పాటు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. మరికొన్ని దేశాలు.. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ, కొలంబియా దేశాలు యూకేకు విమానాలు రద్దు చేశాయి.
యూకేకు తమ సర్వీసులను 48 గంటలపాటు నిలిపి వేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ కూడా యూకే విమానాలను నిలిపివేసింది. పోర్చుగల్, సౌదీ అరేబియా, టర్కీ, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, లాత్వియా, ఎస్టోనియా, చెక్ రిపబ్లిక్‌లు యూకే, దక్షిణాఫ్రికా దేశాలకు నడిచే విమానాలపై తాత్కాలిక ఆంక్షలు విధించాయి. యూకే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ప్రస్తుతానికి భయపడాల్సింది లేదని అంటోంది.
కొత్త రకం వైరస్ మళ్లీ ఏ ముప్పుని తీసుకురాబోతోందో అని బ్రిటన్ భయపడుతోంది. కఠిన ఆంక్షలు విధిస్తూ లాక్‌డౌన్ అమలు పరుస్తోంది. క్రిస్మస్ సంబరాల వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నేతృత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షలు జరుపుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com