బెంగాల్‌లో గెలుపోటముల్లో ఆ ఐదు అంశాలే కీలకం!

బెంగాల్ ఎన్నికలు బీజేపీకి, తృతమూల్‌కు అగ్ని పరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలని కమలం నేతలు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమై ఎనిమిది విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్, వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కలిసి పోటీచేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే తృణమూల్, బీజేపీ.. ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోలను రూపొందించాయి. తమకు కలిసొచ్చే ఓటర్లు ఎవరో గుర్తించి తద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదు అంశాలే గెలుపోటమిల్లో కీలకం కానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
1.ముఖ్యంగా సైలెంట్ ఓటర్లుగా పిలవబడుతున్న మహిళా ఓటర్లది బెంగాల్ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర కానుందని చెబుతున్నారు. మొత్తం జనాభాలో వీరు 49శాతంగా ఉన్నారు. వీరిని ఆకట్టుకొనేందుకు రెండు పార్టీలూ పోటీపడి హామీలు గుప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, ప్రభుత్వ రవాణా సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 50మంది మహిళా అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో దించింది. మహిళా ఓటర్లకు అనుకూలంగా ఉండే పార్టీకి ఈ ఎన్నికల్లో మంచి ఫలితం వస్తుందనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.
2.ఇక బెంగాల్‌లో మధ్యతరగతి ఓటర్లది కూడా కీలక పాత్రే. గత లోక్‌సభ ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. అయితే ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఓ సమస్యగా మారింది. ఈ అంశమే ప్రధాన ఎజెండాగా దీదీ స్కూటర్‌పై ప్రయాణం చేసి ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం కూడా చేశారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామంటూ హామీ సైతం ఇచ్చారు. ఈ అస్త్రం మధ్య తరగతి ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
3.మరోవైపు బెంగాల్‌ను పట్టిపీడుస్తున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు పదేపదే బీజేపీ టార్గెట్ చేస్తోంది. గత పదేళ్లలో ఇక్కడి యువతకు లభించిన ఉద్యోగాలు సంఖ్య తక్కువేనని చెప్పుకోవాలి. ఈ అంశం దీదీపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, మమత మాత్రం ఏటా 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బీజేపీ మరో అడుగుముందుకేసి ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
4.అటు బెంగాల్‌లో ముస్లిం ఓటర్లదే అత్యంత కీలక పాత్ర. గతంలో 35ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడటంలో మమతకు మద్దతుగా నిలిచింది ఈ ఓటర్లే. దాదాపు 30శాతం ముస్లిం ఓటర్లు ఉన్న బెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్లలోనూ వారు ప్రభావం చూపగలరు. బెంగాల్‌లో వీరి ప్రాధాన్యత ఏంటో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి బాగా తెలుసు. అందుకే మైనార్టీల సమస్యల పరిష్కారంలో తానే ఛాంపియన్ అని తరచూ చెప్పుకుంటారు దీదీ. ఆ ఓట్లపైనే ఆమె ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ముస్లిం ఓటర్ల ప్రభావం అధికంగా ఉండే నందిగ్రామ్ నుంచే ఈసారి ఆమె బరిలో నిలిచారు. దీనికితోడు 42మంది ముస్లిం అభ్యర్థులను ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీలో దించారు. మరోవైపు, ముస్లిం ఓట్లు చీలితే తమకు లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది.
5. ఇక మరో ముఖ్యమైన అంశం సీపీఎం ఓటు బ్యాంకు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 29శాతానికి పైగా ఉన్న సీపీఎం ఓటు బ్యాంకు.. 2019 ఎన్నికల నాటికి 7.46శాతానికి పడిపోయింది. అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంకు 17 శాతం నుంచి 40.25శాతానికి పెరిగింది. రాష్ట్రంలో వామపక్షాలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. తమ శత్రువైన తృణమూల్‌కు ఓటేసే పరిస్థితి ఉండదు. అయితే, ఆ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉండొచ్చు. మరోవైపు, లెఫ్ట్‌ను ఆగర్భ శత్రువుగా భావించే మమతా బెనర్జీ కూడా ఇటీవలి కాలంలో వామపక్ష ఓటర్లు తమకే ఓటు వేయాలంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో సీట్లు దక్కని ఆశావహులతో బీజేపీ, తృణమూల్ రెండు పార్టీలకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి ఈ అయిదు కీలక అంశాలపైనే బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com