బాసు బాగా డ్యూటీ చేస్తున్నారు.. మైఖేల్ జాక్సన్ స్టెప్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్

బాసు బాగా డ్యూటీ చేస్తున్నారు.. మైఖేల్ జాక్సన్ స్టెప్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్
ఎందుకొచ్చిన ఉద్యోగం అని ఈసురోమంటూ డ్యూటీ చేస్తే ఎలా.. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి.

ఎందుకొచ్చిన ఉద్యోగం అని ఈసురోమంటూ డ్యూటీ చేస్తే ఎలా.. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. మన అభిరుచులను అందులో మిళితం చేస్తే డ్యూటీతో పాటు మన కోరికకూడా తీరుతుంది అని ఆ ట్రాఫిక్ పోలీస్ బాస్‌కి బాగా తెలిసినట్లుంది. అందుకే తనకు వచ్చిన, తనకు ఇష్టమైన మైకేల్ జాక్సన్ స్టెప్స్‌ని ఇరగదీస్తున్నారు. హ్యాపీగా డ్యూటీ చేసేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్ నగరంలో దాదాపు పదహారు సంవత్సరాలుగా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి దివంగత పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ స్టెప్స్ 'మూన్‌వాక్' ను ఉపయోగిస్తున్నారు. విధి నిర్వహణలో తాను కనబరిచే ప్రత్యేక శైలి కారణంగా సోషల్ మీడియాలో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ప్రజలు తరచుగా ఆయనతో సెల్ఫీలు దిగడాన్ని ఇష్టపడతారు. అయితే అతడి ఆనందం వెనుక ఒక విషాద కథ ఉంది.

దాదాపు పదహారు సంవత్సరాల (అతను పనిలో నృత్యం చేయడం మొదలుపెట్టినప్పటి నుండి) క్రితం డ్యూటీలో ఉన్నప్పుడు నా పై అధికారుల నుంచి ఒక సందేశం వచ్చింది. ఫలానా ఏరియాలో యాక్సిడెంట్ అయింది. అక్కడకు వెళ్లి ట్రాఫిక్ కంట్రోల్ చేయమని. సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి చూస్తే ప్రమాదంలో చనిపోయింది నాస్నేహితుడే అని తెలిసి కుప్ప కూలిపోయాను.

వెంటనే నా డ్యూటీ నేను చేయాలన్న తలంపుతో బాధను గుండెల్లోనే దిగమింగుని అప్రయత్నంగా డ్యాన్స్ చేసుకుంటూ అక్కడి నుంచి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో నన్ను అధికారులు, ప్రజలు గమనిస్తున్నారన్న విషయం స్ఫురణకు రాలేదు.

నా డ్యాన్స్ వారికి నచ్చబట్టే కదా నన్ను చూస్తున్నారు అనుకుని అప్పటి నుంచి అలాగే డ్యాన్స్ స్టెప్పులతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మొదలు పెట్టానని చెబుతున్నారు రంజిత్. తనకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ర్‌ని కావాలని కోరిక ఉండేదని.. పేదరికం కారణంగా పరిస్థితులు అనుకూలించక పోలీస్ అయ్యానని అంటారు. డ్యాన్స్ చేయాలన్న కోరికను ఈ విధంగా తీర్చుకుంటున్నానని అన్నారు.

మరి పై అధికారులు ఇలా చేస్తుంటే ఏమీ అనలేదా అంటే డ్యూటీకి సక్రమంగా నిర్వర్తిస్తూ రిమార్క్ లేకుండా చూసుకోవడంతో వారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పారు.

వాహనదారుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి నేను కూడా సహాయం చేస్తున్నానని అన్నారు. "ప్రజలు మానసిక ఒత్తిడిలో ఉంటున్నారు, వారు నా డ్యాన్స్ చూసినప్పుడు మంచి అనుభూతికి లోనవుతారు. పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ చోబే ట్రాఫిక్ పోలీస్ రంజిత్‌ను ప్రశంసించారు. "అతను తన పనిని చక్కగా చేస్తాడు. అతనికి కేటాయించిన చోట ట్రాఫిక్ క్రమబద్ధత సజావుగా ఉంది అని ఆయన అన్నారు.

రంజిత్ సింగ్ అనేక టెలివిజన్ షోలలో పాల్గొన్నారు. ఉత్తమ ట్రాఫిక్ నిర్వహణకుగాను ఆయనకు అవార్డు లభించింది. పనిలో అతని నృత్యం కాకుండా, అతను ఇతర ట్రాఫిక్ పోలీసులకు కూడా శిక్షణ ఇస్తారు.

Tags

Next Story