Rajasthan: అత్త కాదు అమ్మ.. కొడుకు మరణించినా కోడలికి కన్యాదానం చేసి..

Rajasthan: అత్త కాదు అమ్మ.. కొడుకు మరణించినా కోడలికి కన్యాదానం చేసి..
Rajasthan: కొడుకు చనిపోతే కోడలిది తప్పెలా అవుతుందని అందరి నోళ్లు మూయించింది అత్తగారు.

Rajasthan: భర్త చనిపోతే భార్య జాతకం బాగాలేదని ఆడవారిపై నిందవేస్తుంటారు లోకంలో చాలా మంది అత్తమామలు. కొడుకు చనిపోయిన దు:ఖాన్ని గుండెల్లోనే దాచుకుని కోడలి భవిష్యత్ గురించి ఆలోచించింది మానవత్వం ఉన్న ఓ అత్త. కోడలికి మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంది రాజస్థాన్‌ లోని సికార్‌ గ్రామానికి చెందిన కమలా దేవి.

భార్య వల్లే భర్త చనిపోయాడంటూ బంధువులంతా తిడుతుంటే, కొడుకు చనిపోతే కోడలిది తప్పెలా అవుతుందని అందరి నోళ్లు మూయించింది అత్తగారు. కమలా దేవి, దిలావర్‌ దంపతులకు కొడుకు శుభమ్‌ ఉండేవాడు. యుక్త వయసు వచ్చిన తరువాత సునీత అనే అమ్మాయితో శుభమ్‌కు 2016లో వివాహం చేశారు తల్లిదండ్రులు.



సునీత పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అయినా అందం, గుణం చూసి పైసా కట్నం తీసుకోకుండా తన కొడుకు శుభమ్‌కి చేసుకుంది కమలాదేవి. కొడుకు. కోడలు ఈడు జోడు బాగున్నారని అత్తమామ సంతోషించేలోపు విధికి కన్నుకుట్టింది. పెళ్లైన ఆరు నెలలకే సునీత భర్త బ్రెయిన్ డెడ్‌ అవడం వల్ల చనిపోయాడు.

చిన్నవయసులో భర్తను కోల్పోయిన సునీతను ఆమె తల్లిగారింటికి పంపడం కమలా దేవికి ఇష్టం లేదు. దీంతో ఒక నిర్ణయానికి వచ్చింది. సునీతని తమ వద్దనే ఉంచుకుని చదివించాలనుకున్నారు. ఆమెను కాలేజీకి పంపించి చదివించింది. అత్తమామలను అమ్మానాన్నగా భావించిన సునీత చదువుపై శ్రద్ధ పెట్టి ఎంఏ బీఈడీ చేసింది.



జూనియర్‌ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించింది. తమ కోడలికి మంచి జీవితం కూడా ఇవ్వాలని భావించారు అత్తమామలు. కోడలిని ఒప్పించి మళ్లీ పెళ్లి చేశారు. ముఖేష్‌ అనే వ్యక్తితో 22 జనవరి 2022 బంధువులందరి సమక్షంలో సునీత వివాహాన్ని ఘనంగా జరిపించారు.

కమలాదేవి - దిలావర్‌ దంపతులు వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసారు. అప్పగింతల సమయంలో వాళ్ల బంధం చూసి ఊరిజనంఆశ్చర్యపోయారు. సునీత ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అత్తమామలు .. అమ్మానాన్నలయ్యారని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story