వేడెక్కిన బెంగాల్ రాజకీయం.. దీదీ-సువేందు మధ్యలో నందిగ్రామ్

వేడెక్కిన బెంగాల్ రాజకీయం.. దీదీ-సువేందు మధ్యలో నందిగ్రామ్
మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ దీదీకి కౌంటర్ ఇచ్చాడు సువేందు.

బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. నిన్నమొన్నటిదాకా దీదీ పార్టీలోనే కీలక నేతగా ఉన్న సువేందు అధికారి.. మమతా బెనర్జీపైనే పోటీకి సై అంటున్నాడు. సువేందు నియోజకవర్గం నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించి.. బెంగాల్ రాజకీయాల్లో వేడి రాజేశారు. అది నాకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం అని ఆమె వ్యాఖ్యానించారు. మమతా సవాలును స్వీకరించిన సువేందు..ఆమెను ఓడిస్తానంటూ శపథం చేశాడు. మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ దీదీకి కౌంటర్ ఇచ్చాడు.

పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మలుపుతిప్పిన చరిత్ర నందిగ్రామ్‌ది. పదేళ్ల క్రితం అధికారం వామపక్షాల నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు రావడానికి కారణం నందిగ్రామ్ ఘటనే. 2007లో నందిగ్రామ్‌లో సెజ్ ప్రాజెక్టు ఘర్షణల్లో 14 మంది రైతులు మరణించారు. వామపక్షాలపై మమతా బెనర్జీ.. అమ్మ, మట్టి, మనుషులు అనే నినాదాలను ఎక్కుపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే నందిగ్రామ్‌ ప్రాంతంలో సువేందు అధికారి కుటుంబానికి గట్టి పట్టుంది. అలాంటి నేత ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. మళ్లీ నందిగ్రామ్‌ నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు.

గతంలో తమ పార్టీకి అధికారం రావడానికి కారణమైన నందిగ్రామ్ నుంచే పోటీచేస్తానంటూ మమతా బెనర్జీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రకటించారు. ఆమె ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే సువేందు స్పందించారు. ఆమె సవాలును స్వీకరిస్తానని స్పష్టం చేశారు. దీదీని 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానంటూ శపథం చేశారు. మరోవైపు మమతా బెనర్జీ నందిగ్రామ్‌తోపాటు గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తానని ప్రకటించారు. ఆమె నిర్ణయాన్ని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఎద్దేవా చేశారు. మమతకు భవానీపూర్‌లో గెలుస్తాననే నమ్మకం లేనందునే నందిగ్రామ్‌లోనూ పోటీ చేస్తానంటున్నారని విమర్శించారు. ఇక టీఎంసీ పార్టీ కాదని..అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని సువేందు అధికారి విమర్శలు గుప్పించారు.


Tags

Read MoreRead Less
Next Story