Wipro: సగానికి సగం తగ్గిన ఫ్రెషర్స్ జీతం.. ఉంటారో వెళతారో మీ ఇష్టం..

Wipro: పొమ్మనకుండా పొగబెట్టడం అంటే ఇదేనేమో. జీతం కట్ అయినా పర్లేదు.. ఉద్యోగం ఊడపీక్కుండా ఉంటే చాలు అనుకునేలా ఉంది సాప్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి. విప్రోలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్‌కు రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీని విప్రో మొదట్లో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఫ్రెషర్లకు రూ. 3.5 లక్షల వార్షిక ప్యాకేజీని మాత్రమే చెల్లించగలమని ఇమెయిల్‌లో పేర్కొంది.
అసెస్‌మెంట్‌లలో పనితీరు సరిగా లేని కారణంగా 452 మంది ఫ్రెషర్‌లను కంపెనీ తొలగించింది. అది గడిచి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఫ్రెషర్స్‌కు ఇస్తామన్న జీతంలో కూడా 50 శాతం కోత విధించింది. ఈ జీతానికి పనిచేస్తారా లేదా అనేది అభ్యర్థి ఇష్టం. వారి నిర్ణయంపై కంపెనీ వత్తిడి తీసుకురాలేదు.. వారికి తగిన సమయం కూడా ఇచ్చి నిర్ణయం తీసుకోమని చెప్పింది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారు. మీరు ఈ ఆఫర్‌ను అంగీకరించాలని అనుకుంటే మీ పనిని కొనసాగించవచ్చు అని కంపెనీ అభ్యర్థులకు పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది.
విప్రో అధికారి మాట్లాడుతూ, "మా ప్రతిభే మా విలువైన ఆస్తి....మా ప్రస్తుత ఉద్యోగులందరూ విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకునేలా, వారి లక్ష్యాలను సాధించగలిగే వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మారుతున్న పరిస్థితుల కారణంగా, మా వ్యాపార అవసరాల దృష్ట్యా, మేము మా ఆన్‌బోర్డింగ్ ప్లాన్‌లను సర్దుబాటు చేయాల్సి వచ్చింది అని అన్నారు. మహమ్మారి ప్రభావంతో అన్ని సంస్థలు ఆర్థిక మాన్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందులో భాగంగానే ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com