8 నెలల గర్భిణిని నడిపించినందుకు.. మహిళా ఎస్సైపై వేటు

8 నెలల నిండు గర్భిణిని అని కూడా చూడకుండా నడిరోడ్డు మీద నడిపించిన ఆరోపణ కింద సబ్ ఇన్‌స్పెక్టరు రీణా బక్సల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కప్తిపాడా స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ ప్రధాన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మయూర్‌భంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ వ్యవధిలో మయూర్‌భంజ్ స్టేషన్ అధికారుల పర్యవేక్షణలో రీణా బక్సల్ ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మయూరభంజ్ జిల్లాలోని శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గర్భిణి గురుబారి బిరూలి, భర్త బిక్రమ్ బిరూలితో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి బయలుదేరింది. వారు వెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీ చేశారు. భర్త హెల్మెట్ ధరించినా భార్య ధరించనందున గురుబారి బిరూలి దంపతులను ఆపారు. నగదు లేనందున ఆన్లైన్ లో చెల్లిస్తామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు వినలేదు.
దీనితో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అయిన గర్బిణి గురుబారి బిరూలిని నడి రోడ్డు మీద వదిలేసి భర్త బిక్రమ్ బిరూలిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీనితో 3 కిలో మీటర్ల దూరం దాదాపు 4 గంటల సేపు కష్టపడి గర్భిణి పోలీసు స్టేషన్‌కు చేరి తీవ్ర ఆవేదనకి గురైంది. ఈ మేరకు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పైన స్పందించిన పొలీస్ అధికారులు సంబంధిత స్టేషన్ అధికారిపై సస్పెన్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com