చీర విప్పి చిన్నారిని రక్షించిన మహిళ

కాలువలో కొట్టుకుపోతున్న ఆ పిల్లాడిని చూసింది.. సాయం కోసం చుట్టుపక్కల చూడగా.. ఎవరూ కనపడలేదు.. మెరుపులాంటి ఆలోచన.. వెంటనే ఒంటిమీదున్న చీర విప్పేసి మునిగిపోతున్న ఆ బాలుడికి అందించి ఒడ్డుకు చేర్చింది. కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎడమకాలువ సమీపంలో శుక్రవారం ఆరేళ్ల అరుణ దొడమని ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. అక్కడే బట్టలు ఉతుకుతున్న షకీనాబేగం గమనించి కేకలు వేసింది. ఆమె కేకలు విని మహేష్ గాళప్ప అక్కడకు వచ్చినా ఈత రాకపోవడంతో కాలువలో దూకే ధైర్యం చేయలేక అలాగే చూస్తుండిపోయాడు. దీంతో షకీనాబేగం ఆ పిల్లవాడిని ఎలాగైనా రక్షించాలనుకుంది. కట్టుకున్న చీరను ఉపాధ్యాయుడైన మహేష్ గాళప్పకు ఇవ్వడంతో అతడు దాన్ని బాలుడికి అందించి జాగ్రత్తగా ఒడ్డుకు లాగాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. ఒంటి మీద చీర విప్పి బిడ్డను కాపాడిన షకీనా బేగంను గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com