Work from home employees: ఐటీ సంస్థల ముందుకు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల డిమాండ్స్..

Work from Employees: కరోనా పుణ్యమా అని ఐటీ ఉద్యోగులతో పాటు చాలా కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాయి. కరోనా తీవ్రత నుంచి బయటపడినా ఆఫీసులకు రావడానికి ఉద్యోగులు మొగ్గు చూపడం లేదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు అందుకు ససేమిరా అంటున్నారు.. ఇంటి నుంచి పని చేయడానికే ఇష్టపడుతున్నారు.
ఒకవేళ మీరు కచ్చితంగా ఆఫీసుకు రావాలని ఆదేశించినట్లైతే పని చేసే చోట తమకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పని విధానంలో మార్పులతో పాటు, ఒత్తిడి లేని వాతావరణం, మంచి ఫర్నిచర్, ఓపెన్ ఆఫీస్ విధానం, ఆలోచనలు షేర్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. స్వతంత్రంగా పని చేసే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలికాక హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి సహా దేశంలోని మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో పది మందిలో సగటున ఆరుగురు ఆఫీసుల్లో మంచి వసతులు కల్పించాలని కోరుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. సీఐఈఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ సంస్థ ఇటీవల ఈ సర్వే నిర్వహించింది.
భాగ్యనగరంలో దాదాపు 6 లక్షల మంది ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గడం ఆఫీసుకు రమ్మని ఉద్యోగులకు కాల్ లెటర్ పంపిస్తున్నాయి ఐటీ యాజమాన్యాలు. తొలుత వారంలో సగం రోజులే కార్యాలయాల్లో పనిచేసే హైబ్రిడ్ వర్క్ కల్చర్ ను అమలు చేస్తున్నాయి.
అయితే కొందరు ఉద్యోగులు పని విధానంలో మార్పులు కోరుతున్నట్లు సర్వే తెలిపింది. మంచి వసతులతో పాటు, తగిన సౌకర్యాలు కల్పిస్తేనే ఆఫీసులకు వస్తామంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. అవన్నీ వదులుకుని మళ్లీ ఆఫీసుకు రావాలంటే కొంచెం కష్టమే.. అని అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com