Yaas Cyclone : దూసుకువస్తున్న యాస్ పెనుగండం..!

Yaas Cyclone : తాక్టే తుఫాను విలయం ఇంకా మరిచిపోకముందే యాస్ రూపంలో మరో ముంపు విరుచుకుపడేందుకు సిద్ధమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ యాస్ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందవచ్చునని సూచించింది. ఈ నెల 26వ తేదీ ఉదయం ఉత్తర ఒడిస్సా , పశ్చిమ బెంగాల్ మధ్య తీరం చేరుకుంటుందని... అదే రోజు సాయంత్రం పరదీప్, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అటు తుఫాన్ తీరం దాటే సమయంలో 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వీటి వేగం 185 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తుఫాను ప్రభావంతో ఒడిస్సా, బెంగాల్ లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యాస్ తుఫాను ప్రభావం ఏపీ, తెలంగాణపై కొద్ది మీద మాత్రమే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వివరించింది. రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు కురుస్తాయని పేర్కొంది. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.
యాస్ తుఫాన్ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని తీర ప్రాంతాల్లో ముప్పు ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారికి వాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ సమాచార వ్యవస్థను దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
మరోవైపు వాతావరణం శాఖ హెచ్చరికలు తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తుఫాను పై సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com