Yashwant Sinha: రాష్ట్రపతి బరిలో యశ్వంత్ సిన్హా.. అన్ని పార్టీ పదవులకు రాజీనామా

Opposition Candidate For President: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఢిల్లీలో ఇవాళ జరిగే విపక్షాల సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరు ప్రకటించొచ్చని తెలుస్తోంది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కారణంగా తృణమూల్ కాంగ్రెస్‌కు సైతం రాజీనామా చేశారు యశ్వంత్ సిన్హా. పార్టీకి రాజీనామా చేస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు యశ్వంత్. జాతీయ ప్రయోజనాల కోసమే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై విపక్షాల ఐక్యత కోసం పనిచేయాల్సి ఉందంటూ ట్వీట్ చేశారు.
ఈ మధ్యాహ్నం రెండున్నరకు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు విపక్షాలు సమావేశం అవుతున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలో విపక్షాలు భేటీ అవుతున్నాయి. ఈ సమావేశంలోనే యశ్వంత్ సిన్హా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సరిగ్గా మీటింగ్‌కు కొన్ని గంటల ముందు యశ్వంత్ సిన్హా అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదిస్తారని ఆశిస్తున్నానంటూ యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు.
మాజీ ఐఏఎస్ అయిన యశ్వంత్ సిన్హా 1984లో జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన గతేడాది పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఎంసీలో చేరి.. ఇవాళ్టి వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఇప్పుడు తృణమూల్‌కు కూడా రాజీనామా చేశారు. సిన్హాకు మాజీ ప్రధాని వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడు. అందుకే, బీజేపీని ఎదుర్కొనేందుకు సిన్హా పేరును వ్యూహాత్మకంగాతెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. పైగా వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు యశ్వంత్‌కు మద్దతు పలికాయి.
అటు.. ఇవాళే ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ముందుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమైన అమిత్ షా.. ఆ తర్వాత వెంకయ్య నాయుడు ఇంటికి వెళ్లారు,.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com