Yogi Adityanath : సీఎంగా చరిత్ర సృష్టించబోతున్న యోగీ ఆదిత్యనాథ్..!

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లో అధికారం దిశగా బీజేపీ కొనసాగుతోంది.. 403 స్థానాలున్న యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు 202 స్థానాలు గెలవాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో బీజేపీ ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎంగా యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృస్టిస్తారు.. 1985 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఏ సీఎం కూడా తన తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు ఆ రికార్డుని యోగి తిరగరాయనున్నారు.
ఇక 15 ఏళ్ల తర్వాత ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో గత 15 ఏళ్లుగా శాసనమండలి ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు. 2007లో మాయావతి, 2012లో అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత 2017లో యోగి ఆదిత్యనాథ్ అలాగే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో నోయిడాకు వెళ్ళిన ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఈ మూఢనమ్మకాల భయం నేతల్లో ఎంతగా ఉందంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా అఖిలేష్ యాదవ్ నోయిడాకు వెళ్ళలేదు.
అఖిలేష్‌తో పాటుగా ములాయంసింగ్ యాదవ్, ఎన్డీ తివారీ, కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌సింగ్ వంటి నేతలు కూడా నోయిడా పర్యటనకు దూరం ఉన్నారు. 2007 మరియు 2012 మధ్య మాయావతి ఈ అపోహను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు.. రెండు సార్లు ఆమె నోయిడాకి వెళ్లారు. కానీ 2012లో ఆమె అధికారం కోల్పోయారు. దీనితో యూపీ రాజకీయాల్లో ఆ మూఢనమ్మకానికి మరింత బలం చేకూరింది.
కానీ యోగి ఆదిత్యనాథ్ దానిని లెక్కచేయకుండా తన పదవీ కాలంలో అనేక సార్లు నోయిడాను సందర్శించారు. ఇప్పుడు యోగీ సీఎం అయితే ఈ అపోహ కూడా బద్దలవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com