Zomato Scam : జొమాటో 'డెలివరీ స్కాం'..

Zomato: జొమాటో డెలివరీ బాయ్స్ చేస్తున్న మోసం పట్ల ఆ సంస్థ యజమానికి ఫిర్యాదు చేశాడు ఓ వినియోగదారుడు. వినయ్ సతీ అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్, వినయ్ తో మాటలు కలిపాడు. "సర్, మరో సారి ఫుడ్ ను ఆర్డర్ చేస్తే 'పే ఆన్ డెలివరీ' ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు మీరు రూ.1000ల ఫుడ్ ను ఆర్డర్ ఇస్తే, కేవలం నాకు రూ.300 ఇస్తే చాలు. మిగిలిన రూ.700 మీరే ఉంచుకోండి" అని ఆఫర్ ఇచ్చాడు.
ఇది ఎలా సాధ్యం అని వినయ్ ప్రశ్నించగా.... "జోమాటో నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ ను కస్టమర్ కనుక బాలేదని తిరిగి ఇచ్చేస్తే, ఆ మనీని రెస్టారెంట్ కు జొమాటో కట్టవలసి ఉంటుంది. మీకు డెలివరీ చేసిన ఫుడ్ మీకు నచ్చలేదని నేను రిపోర్ట్ లో రాస్తాను. ఆ మనీని జొమాటో కట్టేస్తుంది. మీరు నాకు రూ.300 ఇస్తే చాలు" అని చెప్పాడు. దీంతో.. దిమ్మతిరిగిపోయిన వినయ్ వెంటనే సోషల్ మీడియా ద్వారా జొమాటో ఫౌండర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపీందర్ గోయల్ స్పందించారు. కొందరు డెలివరీ బాయ్స్ చేస్తున్న మోసం గురించి తనకు తెలుసని నివారణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ లూప్ హోల్ ను ఉపయోగించుకుని కొందరు ఫుడ్ డెలివరీ బాయ్స్ కస్టమర్స్ ను ఆన్ లైన్ లో చెల్లింపులు జరపవద్దని కోరుతున్నారు. చాలా కాలం నుంచి ఈ తంతు జరుగుతోంది. కొందరు కస్టమర్లు కూడా ఈ ఆఫర్ ను ఉపయోగించుకుంటున్నారు. వినయ్ మాత్రం నిజాయితీగా జొమాటో సీఈఓకు ఫిర్యాదు చేసారు.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని గోయల్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com