America: అమెరికాలో మారణహోమం.. 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు దుర్మరణం..

America: అమెరికాలోని ఉవాల్డేలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో.. 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు మృతిచెందారు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో.. ఇదే అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 18 ఏళ్ల గన్‌మ్యాన్ కూడా చనిపోయి ఉండొచ్చని గవర్నర్ గ్రెగ్ తెలిపారు. ఇద్దరు అధికారులకు తూటా గాయాలు అయినట్లు వెల్లడించారు.
ఒకరు మాత్రమే.. కాల్పులకు తెగబడినట్లు ఉవాల్డే పోలీసు అధికారి పీట్ అర్రెడోండో పేర్కొన్నారు. కాల్పుల ఘటన జరగ్గానే.. రాబ్ స్కూల్‌ను భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. ఎఫ్‌బీఐ అధికారులు సైతం.. రంగంలోకి దిగారు. కాల్పులకు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ ఘటన గురించి అధికారులు వివరించారు. అమెరికాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్ స్టేషన్స్, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మే28 సాయంత్రం వరకు అవనతం చేయాలని బైడెన్ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com