Arjuna Ranatunga: క్రికెటర్స్‌పై మాజీ మంత్రి కామెంట్స్.. ఈ సమయంలో ఐపీఎల్‌లో పాల్గొనకూడదంటూ..

Arjuna Ranatunga: శ్రీలంక ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. తినడానికి ఆహారం ఉన్నా.. దానిని కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలతో పాటు ప్రతీ వస్తువు ధర ఆకాశాన్నంటడంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలవైపు సాయం కోసం చూస్తున్నారు. తాజాగా ఈ ఆర్థిక సంక్షోభంపై ఓ మాజీ మంత్రి స్పందించారు. అంతే కాకుండా ఈ విషయంలో క్రికెటర్లను తీసుకొచ్చి.. వారిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఒకప్పుడు శ్రీలంక క్రికెట్ టీమ్‌ను ఆకాశంలో నిలబెట్టిన ఆటగాడు అర్జున రణతుంగ. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రణతుంగ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం శ్రీలంక సంక్షోభంతో విలవిలలాడుతుంటే ఆ దేశ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్‌లో పాల్గొనడం అస్సలు కరెక్ట్ కాదు అన్నారు ఈ మాజీ మంత్రి.
ఐపీఎల్‌లో పాల్గొంటున్న శ్రీలంక ఆటగాళ్లు తమ దేశ సంక్షోభం గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడినట్టు తాను చూసింది లేదన్నారు అర్జున రణతుంగ. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఇక క్రికెట్ బోర్డ్ సభ్యులు కూడా తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతో దీనిపై స్పందించట్లేదని తోసిపుచ్చారు.
వారం రోజుల పాటు ఐపీఎల్‌ను వదిలేసి క్రికెటర్లంతా వచ్చి సంక్షోభంపై జరుగుతున్న నిరసనలకు మద్దతునివ్వాలని రణతుంగా పిలుపునిచ్చారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఉండాలని, ఎవరి లాభం గురించి వారు ఆలోచించకూడదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ సమస్య కాదని.. అందుకే ఆయన నిరసనలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు అర్జున రణతుంగ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com