Queen Elizabeth 2 : బ్రిటన్ రాణి అంత్యక్రియల ఖర్చు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Queen Elizabeth 2 : బ్రిటన్ రాణి అంత్యక్రియల ఖర్చు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Queen Elizabeth 2 : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి

Queen Elizabeth 2 : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ అంత్యక్రియల కోసం బ్రిటన్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత, ఇతర అవసరాల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 71 కోట్లు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బే చర్చిలో క్వీన్ అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

అంత్యక్రియలకు ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో జరగబోతున్న కార్యక్రమం కాబట్టి, బ్రిటన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 125 సినిమా థియేటర్లలో రాణి అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 మరకత మణులు, 269 ముత్యాలు, 4 రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని.. ప్రస్తుతం ఆమె శవపేటికపై ఉంచారు.

రాణి అంత్యక్రియలకు రెండు వేల మంది ప్రముఖులు, అతిథులు హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మతో పాటు వివిధ దేశాధినేతలు హజరవుతున్నారు. భద్రతా విధుల్లో 5,949 మంది సైనిక సిబ్బంది పాల్గొంటున్నారు. కామన్​వెల్త్ దేశాల నుంచి 175 మంది హాజరయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబే నుంచి వెల్లింగ్టన్ ఆర్చ్ వరకు సాగే రాణి అంతిమ యాత్రలో 1,650 మంది సైనికులు పాల్గొంటున్నారు. . ఇక పది వేల మందికి పైగా పోలీసు అధికారులు లండన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ చరిత్రలో ఇంతమందిని రంగంలోకి దించడం ఇదే తొలిసారి.

రాణిని చూసేందుకు వస్తున్న ప్రజలను నియంత్రించేందుకు లండన్‌లో 36 కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్, వెస్ట్​మినిస్టర్ అబే, బకింగ్​హమ్ ప్యాలెస్ పరిసరాల్లో వీటిని నెలకొల్పారు. అంత్యక్రియలకు పది లక్షల మంది ప్రజలు లండన్​కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో 250 అదనపు రైళ్లను నడిపిస్తున్నారు. ఇక... క్వీన్ భౌతికకాయం ఉంచిన వెస్ట్​మినిస్టర్ హాల్ బయట ప్రజలు 8 కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు.

2002లో రాణి తల్లి అంత్యక్రియలకు 43 కోట్లు ఖర్చు చేసింది బ్రిటన్‌ ప్రభుత్వం. ఇప్పటి కరెన్సీ విలువతో పోలిస్తే ఇది 127కోట్లతో సమానం. ఇక 1997లో ప్రిన్సెస్ డయానా అంత్యక్రియలకు 24 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్య ఖర్చైంది. ఇది ఇప్పటి మొత్తంతో పోలిస్తే 80 కోట్ల నుంచి 135 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఏకంగా 71 కోట్లు ఖర్చు చేస్తోంది.అంత్యక్రియలకు ఇంత భారీగా వెచ్చించడంపై బ్రిటన్​లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు తీవ్రస్థాయికి చేరాయని.. ఈ శీతాకాలం నాటికి 13 లక్షల మంది బ్రిటన్ ప్రజలు పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story