Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టార్ స్కేలుపై 7.3గా..
Japan Earthquake: జపాన్‌ను భారీ భూకంపం వణింకించింది. ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సముద్ర అడుగుభాగంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గతంలో రిక్టార్ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీకి కారణమైన ప్రాంతంలోనే మరోసారి భూమి కంపించినట్లు చెప్పారు.
భూకంపం తీవ్రతతో దాదాపు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. రాజధాని టోక్యోలోనూ 7 లక్షల నివాసాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఐతే టోక్యోలో వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు అధికారులు. భూకంపం సంభవించిన వెంటనే ఫుకుషిమాతో పాటు పొరుగున ఉన్న మియాగి ప్రాంతానికి పోలీసులు, అంబులెన్సులు చేరుకున్నాయి.
భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భూకంప తీవ్రతతో ఫుకుషిమాలో షింకాసెన్ రైలు పట్టాలు తప్పింది. కానీ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు అధికారులు. ఫుకుషిమా అణు రియాక్టర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో తీవ్రంగా భూకంపాలు సంభవిస్తాయి. జపాన్‌లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. 2011లోని నార్త్‌ఈస్ట్ జపాన్‌లో వచ్చిన భూకంపం సునామీకి కారణమైంది. ఇది ఫుకుషిమా అణు ప్రమాదానికి దారి తీసింది. ఈ సునామీ కారణంగా 18 వేల 500 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com