Economic Recession : ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం..

Economic Recession : మాంద్యం ముంచుకొస్తోంది. యూరప్‌లో ఈ ప్రభావం కనిపించడం మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రపంచం ఆర్థికమాంద్యంలో కుంగిపోవడం తప్పదని ఆర్థిక నిపుణులు సైతం చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుండడమే ప్రపంచాన్ని మాంద్యంలోకి నెడుతోంది. జీతాలు పెరుగుతున్నా అంతకంటే ఎక్కువ స్థాయిలో ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
దీనివల్ల దేశాల వృద్ధిరేటు కూడా తగ్గిపోనుంది. అసలు దేశాల వృద్ధిరేటు వరుసగా మూడు నెలలు పడిపోవడమే ఆర్థిక మాంద్యం. రాబోయే రోజుల్లో ఆ గణాంకాలు కూడా రాబోతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరలు భారీగా పెరగడంతో జర్మనీలో గిరాకీ పూర్తిగా పడిపోయి కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. కంపెనీలకు ఆర్డర్లు పూర్తిగా పడిపోయాయి.
బేకరీల వంటి ఇంధన ఆధారిత వ్యాపారాలు దాదాపు మూసివేసే దశకు చేరుకున్నాయి. ఈ దెబ్బతో యావత్ యూరప్ మాంద్యంలోకి జారుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో యూరప్‌లోని దేశాల ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉండొచ్చని పదిలో తొమ్మిది మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణాసియా, లాటిన్ అమెరికాల్లోనూ వృద్ధిరేటు పడిపోవచ్చని చెబుతున్నారు.
భారత్ కూడా ధరలు నియంత్రణపైనే దృష్టిపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ముసురుతోంది. ధరల పెరుగుదలను అలాగే వదిలేస్తే.. మరో దుష్ప్రభావాన్ని ఆహ్వానించినట్లేనని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అందుకే, వడ్డీరేట్లను మరోసారి పెంచారు. అంతర్జాతీయ మాంద్యం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరిస్తోందని తెలిపారు. 2022-23లో దేశ జీడీపీ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గుతుందని కూడా ప్రకటించారు.
వచ్చే జనవరి నుంచి ధరలు అదుపులోకి వస్తాయని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ఈమధ్య ధరాభారం కొంత తగ్గినా.. ఇంధన ధరలు, ఆహార పదార్థాల ధరలు ఇంకా అధిక స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఆహార పదార్థాల నుంచి మరింత ముప్పు పొంచి ఉందని, ఖరీఫ్ పంట దిగుబడి తక్కువగా ఉండొచ్చనే అంచనాలతో, తృణ ధాన్యాలు, గోధుమలు, బియ్యం ధరలు అధికంగా ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com