Pakistan: ఇమ్రాన్‌ ఖాన్‌కి జలక్ ఇచ్చిన ఈసీ.. 3 నెలల్లో ఎన్నికలు అసాధ్యం..

Imran Khan (tv5news.in)

Imran Khan (tv5news.in)

Pakistan: పాకిస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం.. ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

Pakistan: పాకిస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం.. ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై అక్కడి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. చట్టపరమైన, రాజ్యాంగపరమైన కారణాలతో వచ్చే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై అవిశ్వాస తీర్మానాన్ని.. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కొట్టివేసిన కొద్ది నిమిషాల తర్వాత ఆయ‌న‌ ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నట్టు ఇమ్రాన్‌ ప్రకటించారు. 342 మంది సభ్యుల ఉన్న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేలా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ఎన్నికలు జరగాలన్నారు.

అయితే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ ఇందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనతో పాటు జిల్లా-నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ప్రధాన సవాళ్లని ఎన్నికల కమిషన్‌ వర్గాలు చెపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఆరు నెలల సమయం అవసరమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎన్నికల సామగ్రిని సేకరించడం, బ్యాలెట్‌ పత్రాలు సమకూర్చుకోవడం, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి మరిన్ని సవాళ్లు కూడా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ అభిప్రాయపడింది. ముఖ్యంగా వాటర్‌మార్క్‌ కలిగిన బ్యాలెట్‌ పత్రాలు దేశంలో లభ్యం కాకపోవడం, వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

వీటితోపాటు వాటర్‌మార్కుకు బదులు భద్రతా అంశాలు కలిగిన ప్రత్యేక బ్యాలెట్‌ను అమలు చేసే యోచనలో ఉన్న ఎన్నికల కమిషన్‌ అందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా దాదాపు లక్ష పోలింగ్‌ స్టేషన్లకు అవసరమయ్యే 20లక్షల స్టాంప్‌ ప్యాడ్‌లనూ సమకూర్చుకోవడం సమయంతో కూడుకున్నదని స్పష్టం చేసింది.

ఇక న్యాయపరమైన అంశాలకు వస్తే.. ఎన్నికల చట్టంలోని సెక్షన్‌ 14 ప్రకారం ఎన్నికల కంటే 4 నెలల ముందే ప్రణాళికను వెల్లడించాలి. వీటికితోడు ఇప్పటికే పంజాబ్‌, సింద్‌తోపాటు ఇస్లామాబాద్‌ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని.. ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే వాటిని ఉపసంహరించుకోవాల్సి వస్తుందని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. దీంతో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఎన్నికల కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.

Tags

Next Story