KTR: లండన్‌లో కేటీఆర్ పర్యటన.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..

KTR: తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఇంగ్లండ్ చెందిన సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్ భాగ్యనగరంలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఇంగ్లాండ్‌లో సర్ఫేస్ మేజర్ మెంట్ సిస్ట్ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కంపెనీ ప్రతినిధులు తమ ప్రణాళికలు, పరిశోధనలను కేటీఆర్‌కు వివరించారు.
తెలంగాణలో ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాల తమ అత్యాధునిక లాబొరేటరీ ఏర్పాటుకు కారణమని సర్ఫేస్ మేజర్ మెంట్ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ తెలిపారు. ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంలో.. హైదరాబాద్‌లో ఈ లాబొరేటరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్ పౌడర్.. క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు జరగుతాయి.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్‌ను మరింత విస్తరించే ఆలోచనలో సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్ ప్రకటించింది. ఇక తమ లాంటి కంపెనీల పెట్టుబడులకు ఇండియా ఆకర్షనీయ గమ్యమని సంస్థ పేర్కొంది. పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిపి పనిచేస్తుందన్నారు.
ఈ ల్యాబ్‌తో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. హైదరాబాద్ ఫార్మారంగంలో ప్రవేశించబోతున్న సర్ఫేస్ మేజర్ మెంట్ సిస్టమ్స్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా.. అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో ల్యాబ్ ఏర్పాటుచేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్‌కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com