Imran Khan: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం.. బహిరంగంగా ఇమ్రాన్ ఖాన్ రాజీనామా?
Imran Khan (tv5news.in)
Imran Khan: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన పదవికి రాజీనామా చేస్తారనే చర్చ పాకిస్తాన్‌లోనే కాదు అంతర్జాతీయంగాను చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఇస్లామాబాద్ పరేడ్ మైదానంలో ఇమ్రాన్‌ఖాన్ భారీ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానానికి ముందే తన ప్రజా బలాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఆదివారం జరిగే బహిరంగసభ వేదికగా ఇమ్రాన్ తన రాజీనామాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి షేక్ రషీద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలకాలంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని షేక్ రషీద్ తెలిపారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాజీనామా అనంతరం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని ఇమ్రాన్‌ఖాన్ కోరనున్నట్లు సమాచారం.
మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే సభ సోమవారానికి వాయిదా పడింది. దీంతో ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చ జరగనుంది.
కాగా.. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది. 30 మంది ఎంపీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కోల్పోయింది ఇమ్రాన్ సర్కారు. ఇక.. ఇప్పటికే ఇమ్రాన్‌పై ఆ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్‌ఖాన్ పాటిస్తున్న విధానాలే కారణమంటూ విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు పాక్ ఆర్మీ నమ్మకాన్ని కూడా ఇమ్రాన్‌ఖాన్ కోల్పోయారని ఆర్మీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఇటీవల మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాల తీరుపై ఇమ్రాన్‌ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం నుంచి గద్దె దింపితే ప్రతిపక్షాలకు మరింత ప్రమాదమని హెచ్చరించారు.
ఇక మొత్తం 342 సభ్యులున్న పాకిస్తాన్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి 172 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా పాక్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 చివరలో జరగాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com