Iran : ఇరాన్‌లో పెరుగుతున్న కఠిన నిబంధనలు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు బ్లాక్

Iran : హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఏడేళ్లు పైబడిన మహిళలంతా తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సిందేనని ప్రభుత్వం విధించిన నిబంధనపై మహిళలు రగిలిపోతున్నారు.. పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు.. అటు హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఇటీవలే ఓ యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ యువతి పోలీసు కస్టడీలో మృతిచెందిందనే ప్రచారంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆమె అంత్యక్రియల సమయంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అమీని మృతితో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్, మాషాద్ నగరాల్లోని విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చెలరేగాయి. నార్తరన్ ప్రావిన్స్ కుర్దిస్థాన్‌లో మొదలైన నిరసనలు దేశంలోని దాదాపు 30 కీలక నగరాలకు వ్యాపించాయి.. చట్టాల పేరుతో తమను అణచివేస్తున్నారని.. వివక్షపూరిత చట్టాలకు స్వస్తి పలకాలని మహిళలు హెచ్చరిస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఆరు రోజుల నుంచి జరుగుతున్న నిరసనల్లో హింసాత్మక ఘర్షణలు సైతం తలెత్తాయి..
భద్రతా బలగాలు మహిళలను అణచివేసేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగిస్తున్నాయి.. ఈ ఘర్షణల్లో 31 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది.. అయితే మృతుల సంఖ్య 26కి పైగా ఉందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఒక్క ఆర్మోల్ సిటీలోనే 11 మంది చనిపోయినట్లుగా ఇరాన్ హ్యూమన్ రైట్స్ రిపోర్టు చెబుతోంది. బబోల్ అనే మరో సిటీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
ఇరాన్‌లో ఇస్లామిక్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా పాటిస్తారు.. ఇస్లామిక్ కోడ్ అమలయ్యేలా చూడటం కోసం మొరాలిటీ పోలీసు అనే ప్రత్యేక విభాగమే ఉంది.. మహసా అమీనీ హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఆమెను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కస్టడీలో ఆమెను దారుణంగా హింసించారని, తలపై బలంగా కొట్టడంతోనే యువతి చనిపోయిందని కుటుంబ సభ్యులు, మహిళలు అంటున్నారు.. అయితే, పోలీసులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు.. ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్తున్నారు.
అమీని మరణంపై అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆమె తండ్రి అంజాద్ ఆరోపించారు. మరోవైపు అమీని మరణంపై విచారణ జరుపుతామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రకటించారు. ఈ విషయంలో ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన ఉద్యమంలా మారింది.. జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.. హిజాబ్‌లకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు.. హిజాబ్ ధరించని మహిళలకు కఠిన శిక్ష అమలు చేయాలంటూ కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు.. అయితే, ఈ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ హిజాబ్‌లను తొలగిస్తున్నారు మహిళలు.
ఆందోళనలు తీవ్ర తరం అవుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిని బ్లాక్ చేశారు.. గతంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేయగా.. ఆందోళనలు మరిన్ని ప్రాంతాలకు పాకే ప్రమాదం ఉందని ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సర్వీసులను కూడా బ్లాక్ చేశారు.. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లో అయితే ఇంటర్నెట్ సేవలు మొత్తం నిలిచిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com