America: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం.. కాల్పుల మోతకు ఇక చెక్..

America: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం.. కాల్పుల మోతకు ఇక చెక్..
America: అమెరికాను వణికిస్తోన్న కాల్పులకు చెక్ పెడుతూ అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

America: అగ్రరాజ్యం అమెరికా నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. అనేక నగరాల్లో కాల్పులు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ దుండగులు కాల్పులు జరుపుతారోనని అక్కడి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అనేక కాల్పుల్లో తెలుగువారుతో పాటు అమెరికా, ఇతర దేశాల పౌరులు దుండగుల తుపాకుల తూటాలకు బలవుతూనే ఉన్నారు. గత ఆదివారం మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ సిటీలో తెలంగాణకు చెందిన సాయి చరణ్‌ అనే యువకుడిని కొంతమంది దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దొంగతనానికి వచ్చిన సాయుధుల కాల్పుల్లో సాయిచరణ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

అమెరికాను వణికిస్తోన్న కాల్పులకు చెక్ పెడుతూ అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై బైడెన్‌ సంతకం చేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన ఈ అతిపెద్ద చట్టానికి సెనెట్‌లో కూడా ఆమోదముద్ర పడింది. ఇటీవల టెక్సాస్‌లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ప్రతినిధుల సభలో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టగా.. 234కు గాను 193 ఓట్ల తేడాతో పాస్‌ అయింది. బిల్లుకు అనుకూలంగా 14 మంది రిపబ్లికన్లు కూడా ఓటు వేయడంతో తుపాకుల నియంత్రణ చట్టానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇక బిల్లుపై సంతకం చేసిన జోబైడెన్.. ఇది చారిత్రకమైన రోజు అని అభివర్ణించారు.

కొత్త నిబంధనలతో తీసుకొచ్చిన ఈ చట్టం అనేకమంది ప్రజల ప్రాణాలను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రతిఒక్కటీ ఈ బిల్లు ద్వారా సాధించలేనని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జోబైడెన్ హెచ్చరించారు. అమెరికా తీసుకొచ్చిన బిల్లులో కొత్త నిబంధనలను పరిశీలిస్తే.. ఇకపై 18 నుంచి 20 ఏళ్ల వయసులో తుపాకులు కొనాలనుకునేవారికి నేర రికార్డులు ఉన్నాయా అని ఫెడరల్‌, స్థానిక అధికారులు తనిఖీ చేసే గడువును బిల్లు పెంచింది.

ఇప్పటివరకు తనిఖీ ప్రక్రియ మూడ్రోజులు ఉండగా.. ఇపుడు పది రోజులకు పెంచారు. అలాగే గృహహింస నేరగాళ్లు, భార్య లేదా ప్రియురాలితో కలసి ఉన్నా, లేకపోయినా తుపాకులు కొనడానికి ఇకపై అర్హులు కారు. ఇక ప్రమాదకరమైన వ్యక్తుల నుంచి తాత్కాలికంగా తుపాకులను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు కోర్టు ఉత్తర్వులు పొందే హక్కును కల్పించింది. అలాగే తుపాకుల అక్రమ రవాణాదారులకు, ఇతరుల కోసం తుపాకులు కొనేవారికి 25 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. మరి.. ఇకనైనా అమెరికాలో గన్ కల్చర్‌కు.. కాల్పుల మోతకు చెక్ పడుతుందా? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story