Sri Lanka: శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.338.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు..

Sri Lanka: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నిన్న రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు బహిరంగ కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. అయితే, నిరసనకారులు రాంబుక్కనలో రైల్వే ట్రాక్‌ను బ్లాక్ చేశారనీ.. తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే బహిరంగ కాల్పులు జరిపామనీ.. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టు పోలీస్ అధికార ప్రతినిధి నిహాల్ తాల్డువా వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని కేగల్లె ఆస్పత్రిలో చేర్పించగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ ఘటనలో 8మంది పోలీసులకు కూడా గాయాలైనట్టు పేర్కొన్నారు. శ్రీలంకలో ఇంధన ధరలూ భగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం శ్రీలంక 338కు చేరింది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా అర్ధరాత్రి ధరలను పెంచేసింది.
92 ఆక్టేన్ పెట్రోల్ ధరను 84 రూపాయల మేర పెంచేయడంతో లీటర్ పెట్రోల్ ధర 338కి చేరింది. శ్రీలంకలో గత ఆరు నెలల కాలంలో ఎల్‌ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా.. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో అల్లాడుతున్న లంక ప్రజలకు తాజాగా పెంచిన ధరలు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి.
మరోవైపు శ్రీలంకలో గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలిపారు. పలు చోట్ల రహదారులను బ్లాక్ చేసి వాహనాలు, టైర్లకు నిప్పంటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com