Britain Elections : బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ విక్టరీ..

Britain Elections : బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ విక్టరీ..
X
Britain Elections : బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధాని ఎవరు తేలిపోయింది

Britain Elections : బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధాని ఎవరు తేలిపోయింది.ఫైనల్‌ రిజల్ట్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా,ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ విక్టరీ సాధించారు.బ్రిటీష్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. కన్జర్వేటివ్​ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీగా సాగిన పోరులో లిజ్‌ వైపే మొగ్గు చూపారు.నలభై ఏడేళ్ల లిజ్ ట్రస్ మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు.

మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. వరసగా 40కి పైగా మంత్రులు రాజీనామా చేశారు. వరుస రాజీనామాల తర్వాత జులై 7న బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టోరీ నాయకత్వ రేసు అనివార్యమైంది. ఈ పోరులో లిజ్‌ట్రస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ ముందు నుంచి సర్వేలన్నీ చెబుతూ వచ్చాయి. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మూడో మహిళా ప్రధానిగా లిజ్‌ రికార్డు సృష్టించారు.

ఇక లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకొనేందుకు ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా..రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి.దీంతో దాదాపు 21వేల ఓట్ల తేడాతో లిజ్ ట్రస్ గెలిచారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ ట్రస్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు.

మరోవైపు కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియలో మొదట రిషి సునాక్‌ ముందంజలో ఉన్నారు. ఎంపీల్లో ఎక్కువ మంది మద్దతు ఆయనకే లభించింది. పోలింగ్‌లో కూడా ట్రస్‌ రెండో స్థానంలో నిలిచారు. అయితే, పార్టీ సభ్యులు వేసే ఆన్‌లైన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి ట్రస్‌కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. అధికారంలోకి వస్తే వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌ చెప్పడమే అమె విజయానికి కారణమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అనలైజ్‌ చేస్తున్నారు.

అయితే, సునాక్‌ మాత్రం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి పెడతాననే నినాదంతో ముందుకు వెళ్లారు. ఇలా ప్రచారం చివరి దశకు వచ్చే సమయంలో వచ్చిన సర్వేలు లిజ్‌ ట్రస్‌ వైపే మొగ్గు చూపాయి. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని సునాక్‌.. లాస్ట్‌ వరకు తన ప్రచారాన్ని దూకుడుగానే కొనసాగించారు. తాము గెలిస్తే ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని ఇద్దరూ వేర్వేరుగా ప్రకటించారు.

మరోవైపు 1975లో ఆక్స్‌ఫర్డ్‌ వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో లిజ్‌ ట్రస్‌ జన్మించారు.. ఆమె తండ్రి మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌. తల్లి నర్స్‌.. చిన్న తనంలోనే తల్లితో కలిసి అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత రైండేలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేసి ఆక్స్‌ఫర్డ్‌లో చేరారు.. విద్యార్థి రాజకీయాల్లో లిబరల్‌ డెమోక్రాట్ల తరపున చురుగ్గా పాల్గొన్నారు.. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె కన్జర్వేటివ్‌ పార్టీకి మారారు.. తొలిసారిగా సౌత్‌ ఈస్ట్‌ లండన్‌లోని గ్రీన్‌ విచ్‌ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.. 2008లో రైట్‌ ఆఫ్‌ సెంటర్‌ రిఫార్మ్‌ థింక్‌ ట్యాంక్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరారు.

2012లో లిజ్‌ ట్రస్‌ విద్యాశాఖ మంత్రి అయ్యారు. 2014 నాటికి ఆమెను ప్రధాని కేమరూన్‌ తన కేబినెట్‌లోకి తీసుకుని పర్యావరణ శాఖ సెక్రటరీగా నియమించారు. 2015లో కన్జర్వేటివ్‌ సదస్సులో ఆమె మనం మూడింట రెండు వంతులు చీజ్‌ దిగుమతి చేసుకుంటున్నామంటూ చేసిన ప్రసంగం బ్రిటన్‌ దృష్టిని ఆకర్షించింది.. బ్రిటన్‌ చరిత్రలో జరిగిన అత్యంత కీలకమైన బ్రెగ్జిట్‌ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.. ఐరోపా సమాఖ్యలో కొనసాగడానికే లిజ్‌ ట్రస్‌ మొగ్గు చూపారు. కానీ, బ్రెగ్జిట్‌కు బ్రిటన్‌లో ఆమోదముద్ర పడటంతో మనసు మార్చుకున్నారు.. 2016లో ఆమె థెరిస్సా ప్రభుత్వంలో జస్టిస్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు నేతలు మంచి స్ఫూర్తితో ప్రచారాన్ని నిర్వహించారని కన్జర్వేటరీ పార్టీ ప్రశంసించింది. పార్టీ సభ్యులు అడిగిన దాదాపు 600 ప్రశ్నలకు ఈ ఇద్దరు నేతలు సమాధానాలు ఇచ్చారు.

Tags

Next Story