North Korea: నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం.. అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా..

North Korea: అంతర్జాతీయ ఆంక్షలను కాదని ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ .. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్ మిసైల్‌ను పరీక్షించింది. అమెరికా ఆంక్షలకు తాము బెదిరేదిలేదనే సందేశాన్నిచ్చేందుకే.. నెల రోజుల వ్యవధిలోనే నార్త్‌కొరియా మూడో ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది.
అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అగ్రరాజ్యం ఇటీవలే కొత్త ఆంక్షలు విధించింది. తాము ఎవరికీ బయపడేది లేదనే సంకేతాన్ని ఇచ్చేందుకే కిమ్ ఈ పరీక్ష చేపట్టినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియా రెండు క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపిన మరుసటి రోజే నార్త్ కొరియా మీడియా ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం.
ఉత్తర కొరియా దుందుడు చర్యలపై అమెరికా చర్యలకు దిగింది. క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందిస్తున్న ఐదు సంస్థలపై చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఆ దేశంపై కొత్త ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరతామని తెలిపింది. అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాలనే లక్ష్యంతోనే కిమ్ ప్రభుత్వం ఎవరినీ లెక్కచేయకుండా.. వరుసగా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తోందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com