America: మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం.. ఓక్లహోమా మెమోరియల్ డే ఫెస్టివల్‌లో..

America: అమెరికాలో కాల్పుల ఘటనలు కొత్తేమీ కాదు. తుపాకులతో మారణహోమాన్ని సృష్టించాలి అనుకునేవారి సంఖ్య తక్కువేమీ కాదు. కానీ ప్రజల్లో మార్పు తీసుకొని రావడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. అది మాత్రం జరగడం లేదు. ఇటీవల టెక్సాస్ స్కూల్‌లో జరిగిన ఘటన మరవక ముందే అలాంటి మరో దాడి ఓ మహిళ ప్రాణాలు తీసింది.
అమెరికాలోని ఓక్లహోమాలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 1500 మంది పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. అదే సమయంలో అక్కడ ఓ ఘటన చోటుచేసుకుంది. కోపంలో విచక్షణ కోల్పోయిన 26ఏళ్ల స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు ఫెస్టివల్‌లో పాల్గొన్నవారు అంటున్నారు.
ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినగానే ప్రజలంతా పరుగులు తీశారు. కానీ స్కైలర్ బక్నర్ జరిపిన ఈ కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అంతే కాకుండా ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి ఉన్నట్టు పోలీసులు అంటున్నారు. మొదట స్కైలర్ బక్నర్ అక్కడి నుండి పారిపోయినా.. ఆదివారం సాయంత్రం తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com