Omicron: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్.. అమెరికాలో రోజుకు రెండు లక్షలమంది..
Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసులు 578కి చేరాయి. మొత్తం ఒమిక్రాన్ కేసులలో ఢిల్లీలో అత్యధికంగా 142 కేసులు నమోదయ్యాయి. దేశంలో వారంలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
ఒమిక్రాన్ కారణంగా ఎన్నికలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఒమిక్రాన్‌పై ఇవాళ ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక సమర్పించనుంది ఆరోగ్య శాఖ. ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ నుంచి ఈసీ సూచనల్ని కోరింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఈసీ నిర్ణయం తీసుకోబోతోంది.
మరోవైపు దేశాన్ని చుట్టుముడుతున్న ఒమిక్రాన్ టెన్షన్.. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తీసుకొచ్చింది. ఒక్కో రాష్ట్రం ఒమిక్రాన్ కౌగిలికి చిక్కుతుండడంతో.. రాత్రిళ్లు బయట తిరగడాన్ని నిషేధిస్తున్నాయి. అటు షిర్డీ ఆలయ దర్శనాలపైనా ఆంక్షలు విధించారు.
ఆలయాన్ని రాత్రి వేళలో మూసివేస్తున్నట్టు షిర్డీసాయి సంస్థాన్ తెలిపింది. కర్ఫ్యూ వేళలను దృష్టిలో ఉంచుకుని భక్తులను ఉదయం, రాత్రి హారతులకు అనుమతించబోమని ప్రకటన జారీచేసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ముందు కర్ఫ్యూలు పెట్టి.. ఆ తరువాత లాక్‌డౌన్ల దిశగా వెళ్లారు. ఇప్పుడు చలికాలంలోనే ఆ పరిస్థితులు వస్తాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఒమిక్రాన్ కారణంగా ఆస్ట్రేలియాలో ఫస్ట్ డెత్ రికార్డ్ అయింది. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో 80 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా చనిపోయినట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక అమెరికానైతే ఒమిక్రాన్ అల్లాడిస్తోంది. ముఖ్యంగా పిల్లలకు ఒమిక్రాన్ సోకడం, పెద్ద సంఖ్యలో పిల్లలు ఆస్పత్రుల్లో చేరడంతో ప్రపంచ దేశాలకు కొత్త కలవరం మొదలైంది.
పైగా అమెరికాలో ఒమిక్రాన్ కేసులు ఒకేసారి నాలుగు రెట్లు పెరిగాయి. గత వారం రోజులుగా అమెరికాలో రోజుకు సగటున రెండు లక్షల మంది ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. జోర్డాన్‌లో నిన్న ఒక్క రోజే 295 కొత్త కేసులు నమోదయ్యాయి. పెరూలోనూ 71 కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ ఇప్పుడు దాదాపు 100 దేశాలకు పాకేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com