Pakistan : మోదీకి విదేశాల్లో ఎన్ని ఆస్తులున్నాయో ఎవరైనా చెప్పగలరా : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pakistan : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ విదేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కూడబెట్టారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఒక దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి విదేశాల్లో ఇంత పెద్ద మొత్తం అక్రమాస్తులు కూడబెట్టడం నవాజ్ షరీఫ్‌కే చెల్లుతుందన్నారు. అదే సమయంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావించారు. మోదీకి విదేశాల్లో ఎన్ని ఆస్తులున్నాయో ఎవరైనా చెప్పగలరా అని ప్రజలను ప్రశ్నించారు. తద్వారా మోదీ అవినీతికి దూరమని, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతిలో మునిగితేలారని ఇమ్రాన్ చెప్పకనే చెప్పారు.
ఇమ్రాన్ కొంత కాలంగా నరేంద్రమోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్‌యుద్ధం వేళ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే భారత్ రష్యా వద్ద తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిందని ఇమ్రాన్ ప్రశంసించారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా ఉందని, పాకిస్థాన్‌లో అలా లేదని ఇమ్రాన్ వాపోయారు.
పాక్ నేషనల్ అసెంబ్లీలో మెజార్టీ లేక పాక్ ప్రధాని పదవి కోల్పోయినప్పటినుంచీ ఇమ్రాన్ ఖాన్ అవకాశం వచ్చినప్పుడల్లా మోదీని పొగడ్తున్నారు. పాకిస్థాన్‌ను, పాక్ నాయకత్వాన్ని భారత్‌తోనూ, భారత నాయకత్వంతోనూ పోలుస్తూ వస్తున్నారు. బహిరంగ సభల్లో నేరుగా ప్రజలనే ప్రశ్నిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ప్రకటన దృశ్యాలను కూడా ఆయన స్క్రీన్‌లపై ప్రదర్శిస్తూ ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com